
ప్రజాశక్తి - సంతమాగులూరు
వైసిపి అరాచకాలను చంద్రబాబు, లోకేష్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎండగట్టినందుకే చంద్రబాబును ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా అడ్డరోడ్డు జంక్షన్ నుండి కామేపల్లి ఎన్టీఆర్ విగ్రహం వరకు సైకిల్ ర్యాలి నిర్వహించారు. మూడు కిలోమీటర్ల దూరం రవికుమార్ సైకిల్ తొక్కుతూ ర్యాలీకి ముందు వరుసలో ఉన్నారు. కామేపల్లి ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వలో రాష్ట్రంలో 40 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు పెట్టి చదువుకున్న నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించాలన్నదే లక్ష్యంగా పనిచేసి 80వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. అందుకే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో బాబు అరెస్టుకు నిరసన తెలిపారని అన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి 40ఏళ్ల దేశ రాజకీయాలలో సీనియర్ నేతగా చంద్రబాబు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని తెలిపారు. 25ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని అన్నారు. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు అనేక సవాళ్లను ఎదుర్కొని రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని అన్నారు. ప్రపంచంలోనే ఎవరికి సాధ్యపడని విధంగా అమరావతి రాజధాని కోసం 33వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి పూలింగ్ పద్ధతిలో సేకరించడం చంద్రబాబుకే సాధ్యమని అన్నారు. నేడు జగన్‌రెడ్డి అమరావతిని నాశనం చేయడమే కాకుండా స్మశానంతో పోలుస్తూ మహిళా రైతులపై దాడులు చేసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సన్నేబోయిన ఏడుకొండలు, గొట్టిపాటి చౌదరిబాబు, తేలప్రోలు రమేష్, చేవూరి వాసురెడ్డి, కొనికి గోవిందమ్మ, ధూపాటి ఏసోబు, గుండపునేని సురేష్, గాడిపర్తి రాంబాబు, పసుపులేటి కోటేశ్వరరావు, దేవా, అయినాల శ్రీనివాసరావు, మాదాల సుబ్బారావు, గమిడి కోటేశ్వరరావు, నంబుల కొండలు పాల్గొన్నారు.