చిన్నారుల్లో దేశభక్తి భావాలను పెంపొందిస్తూ వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ (విసిసి), రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటరాక్ట్ క్లబ్ ఆఫ్ విసిసి సైకిల్ రైడ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ కార్యక్రమం ఆదివారం అత్యంత చైతన్యపూరితంగా సాగింది. నగర వ్యాప్తంగా సాగిన ఈ రైడ్‌లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రజాశక్తి - కలెక్టరేట్ : జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ ట్రెజరర్ వినరు గాంధీ, సెక్రటరీ జెఎస్.మూర్తి హాజరై రైడ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడం ఈ రైడ్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ద్వారా వచ్చిన స్వాతంత్య్రం, ప్రస్తుత పరిస్థితులు, అసమానతలను వారు వివరించారు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యతని తెలిపారు. కొబ్బరితోట వద్ద ప్రారంభమైన రైడ్ ఎల్లమ్మ తోట వద్ద ముగిసింది. విసిసి బాధ్యులు ఎల్లాజీ, సంతోష్, గణేష్, సుబ్బారావు పాల్గొన్నారు.
ఎంవిపి.కాలనీ : రోటరీ క్లబ్ నుంచి కార్యక్రమం ప్రారంభమైంది. మోదాంబిక దేవి జెండా ఊపి రైడ్‌ను ఆరంభించారు. మద్దిలపాలెం జోన్‌లో అంజయ్య నగర్‌లో ఈ రైడ్ ప్రారంభమై గొల్ల వీధి, ఫిషెర్‌మెన్ కాలనీ, పెదజాలారిపేట, పెద వాల్తేర్, శివాజీపాలెం, పిఠాపురం కాలనీ, పీతలవానిపాలెం, భానునగర్, హెచ్‌బి.కాలనీ ప్రాంతాల మీదుగా సాగి అల్లూరి విగ్రహం వద్ద ముగిసింది. 25 మంది ఈ రైడ్‌లో పాల్గొన్నారు. విసిసి నాయకులు హరిత, కీర్తన, నందిని, రాహుల్, సూర్యకిరణ్, గౌతమి, రాహుల్, పార్థు, నమ్రత, అశ్విని, ఉజ్వల్ దేనిత్, వెంకటేశ్వర్లు, లక్ష్మి, మల్లిక, ఐద్వా నాయకులు కుమారి పాల్గొన్నారు.










