ప్రజాశక్తి -సీలేరు
జికె.వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ కార్యాలయంలో వైద్య అధికారి కెవి.నాగభూషణం ఆధ్వర్యంలో మంగళవారం సైకిల్ ఫర్ హెల్త్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డీకే. హిమబిందు మాట్లాడుతూ సైకిలింగ్ ప్రతిరోజు చేయడం వలన ఆరోగ్యానికి బహుళ ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. ప్రధానంగా శరీరక బరువు, ఒత్తిడి రక్తపోటు నియంత్రించుకోవచ్చని పేర్కొన్నారు. శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడమే కాకుండా నిద్ర సమయస్ఫూర్తిగా పడుతుందని పేర్కొన్నారు. జేమ్స్ గల్లాగర్ బిబిసి అధ్యయనం ప్రకారం సైకిలింగ్ వల్ల ఏ కారణం చేతనైనా 41శాతం మరణాలను నియంత్రించుకోవచ్చని, కేన్సర్ సంబంధిత మరణాలు 45 శాతం, గుండెకు సంబంధించిన మరణాలు 46శాతం అదుపు చేయవచ్చని తెలిపారు. నులిపురుగులు నివారణ మందులు కూడా విద్యార్థులకు పంపిణీ చేయాలని వైద్య సిబ్బందికి ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌లు నాగలక్ష్మి, లోవ కుమారి, ఎంపిహెచ్‌ఈఓ పోతురాజు, పారామెడికల్ సిబ్బంది గోవిందు అప్పారావు, బాలకృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.










