Jul 29,2021 22:21

న్యూఢిల్లీ : భారత సంజ్ఞ భాష(ఐఎస్‌ఎల్‌)కు లాంగ్వేజ్‌ హోదా కల్పిస్తున్నామని, తద్వారా విద్యార్థులు పాఠశాలల్లో ఇతర భాషల్లానే ఈ భాషను కూడా చదువుకోవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఇది ప్రత్యేకంగా దాదాపు 3 లక్షల మంది వికలాంగ విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తుందన్నారు. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) అమలులోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. మాతృభాషల్లో విద్యాబోధన సాగితే గ్రామీణ, పేద, గిరిజన నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి పైలట్‌ ప్రాజెక్టుగా 8 రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్‌ కళాశాలలు హిందీ, తెలుగు, తమిళ్‌, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఇంజనీరింగ్‌ కోర్సులను ప్రారంభిస్తుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్‌ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా ఒక టూల్‌ను కూడా అభివఅద్ధి చేసినట్టు తెలిపారు. ప్రాథమిక విద్యలో కూడా మాతృభాషను ప్రోత్సహిస్తామని, కొత్తగా ప్రారంభించిన 'విద్య ప్రవేశ్‌ ప్రోగ్రామ్‌' ఇందులో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా పాల్గన్నారు.