తెలుగుగడ్డ మీద కమ్యూనిస్టు ఉద్యమానికి ఉన్న ఘనమైన చరిత్రలో మోటూరు హనుమంతరావు గారి లాంటి వారి పాత్రను... ఆయన 20వ వర్థంతి సందర్భంగా ఇప్పుడు గుర్తుతెచ్చుకోవడం ఎంతో సముచితం. ఆయన సొంత ఆస్తులు అమ్మి పార్టీకి ఖర్చుపెట్టి పార్టీ ప్రయోజనమే సొంత ప్రయోజనం కంటే మిన్నగా భావించిన రోజులవి. 1968లో నేను విజయవాడ తొలిసారి వచ్చినప్పుడు మానికొండ సుబ్బారావు గారు చిన్న పాకలో ఉన్నారు. డి.వి.సుబ్బారావు గారు విశాలాంధ్ర మేనేజరు ఆనాటికే మరణించారు. తమ ఆస్తులు అమ్మి విశాలాంధ్ర పత్రిక కోసం నిలబడ్డ డి.వి.యస్. జైలుపాలయ్యారు. జైలులో టి.బి. వ్యాధి కబళించింది. మోటూరు హనుమంతరావు గారు క్లిష్ట సమయంలో సిద్ధాంతం కోసం విశాలాంధ్ర ఎడిటర్‌గా నిలబడటంతో జైలుపాలయ్యారు. ఇలా తీవ్ర నిర్బంధాలను ఎదుర్కోవడమేగాక...తమ ఆస్తిపాస్తులను ప్రజా ఉద్యమాలకు ఖర్చు చేసి గొప్ప విలువలు నెలకొల్పారు.
ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు ఉద్యమం, ప్రజాశక్తి... అటు డివియస్, ఇటు ఎం.హెచ్ గార్లను గుర్తు చేసుకోవడం, వారికి దీటైన వారసులుగా ఎదిగేందుకు ప్రతినబూనడం అవసరం. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా కల్లోలం సృష్టించడంతో ప్రజలు కకావికలులయ్యారు. ఎవరు చనిపోతారో? ఎవరు బ్రతుకుతారో? అర్థంగాని రోజులు ఇవి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, లాక్‌డౌన్ కారణంగా పత్రిక పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కొని పత్రికలో సిబ్బంది ఎంతో చైతన్యంతో వ్యవహరించి మోటూరు హనుమంతరావు లాంటివారి విలువలను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పనులు కోల్పోయిన ప్రజలు, వైద్య సదుపాయం అందని రోగులు, మరణించేవారి ఆర్తనాదాలు వెలుగులోకి తెచ్చి పత్రికా రంగంలో ప్రత్యేకంగా నిలిచింది ప్రజాశక్తి.
రచనా శైలి
నాలుగున్నర సంవత్సరాలపాటు కారాగార వాసం, ఐదు సంవత్సరాల రహస్య జీవితం లాంటివేకాదు పత్రికా సంపాదకుడిగా గొప్ప సిద్ధాంతకర్తగా రాజకీయ కర్తవ్యాన్ని, రచనాశైలి ప్రాధాన్యతను కూడా జీవిత కాలంలో చాటి చెప్పారు ఎం.హెచ్. వ్యాసం రాసినా, పుస్తకం ప్రచురించినా తనదైన, పదునైన ముద్ర వేశారు. ఎమర్జెన్సీ విధించి మాకినేని బసవపున్నయ్య లాంటి వారిని రాజమండ్రి జైలులో కుక్కి వ్యవహరిస్తున్న రాక్షస పాలనను అమోఘంగా రచనా రంగం ద్వారా ఎదుర్కొన్న ధీశాలి ఆయన. సంజరుగాంధీ యువజన కాంగ్రెస్ నాయకుడిగా 20 అంశాల కార్యక్రమం పేరుతో వేలాదిమందిని జైలులో పెట్టి, ఎమర్జెన్సీకి తిరుగులేదని తిరుపతి, గూడూరు, గుంటూరు సభల్లో ఉపన్యసించడానికి కొత్తి రఘురామయ్యతో కలిసి బయలుదేరినప్పుడు మోటూరు హనుమంతరావు ''రాజువెడలె...రవితేజములలరగా'' అన్న కరపత్రం రహస్యంగా ఉండి విడుదల చేశారు. అందులో ఎమర్జెన్సీ పాడుకాలం పొయ్యేకాలం అన్నారు. రహస్యంగా ఉన్న రోజుల్లో పంపిణీ చేసిన ఈ కరపత్రం గొప్ప విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ప్రేరేపించింది. ఎమర్జెన్సీ ఎక్కువకాలం అమలుచేయడం సాధ్యంగాదని చాటిచెప్పింది ఈ కరపత్రం. మోటూరు హనుమంతరావుగారి రచనా శైలికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ప్రతి వ్యాసం, ప్రతి కరపత్రం ఆయన రాస్తున్నప్పడు తక్కిన వారి అభిప్రాయం కూడా అడిగి అవసరమైన మార్పులు చేసేవారు. 'ప్రజల నుండి ప్రజలకు' అన్నది ఆయన రచనాశైలి.
సైద్ధాంతిక ఒరవడి
ఎం.హెచ్ సైద్ధాంతిక రంగంలో గొప్ప ఒరవడిని దిద్దారు. సీలింగు చట్టం, ప్రభుత్వరంగ పరిశ్రమల నిర్మాణం లాంటి వాటిల్లో కొందరికి గొప్ప అభ్యుదయం కనబడితే...మోటూరు హనుమంతరావుగారికి ఇది పాలకులు ప్రజల్లో భ్రమలు, సృష్టించే చర్చగా, పెట్టుబడిదారులు బలపడడానికి ఉద్దేశించిందిగా కానవచ్చింది. ఆ భ్రమలపై పోరాడారు. కమ్యూనిస్టు ఉద్యమానికి సిద్ధాంతం పునాది. కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి, జనసేన లాంటి పార్టీలకు ఇది పెద్ద అంశం కాదు. అధికారమే వారికి కీలకం. మతోన్మాదం, కులతత్వం, ప్రాంతీయతత్వం లాంటివి వీరికి సమస్యలు కావు. అధికారం వస్తుందనుకుంటే ఏ తెరైనా లేపుతారు. అందుకు భిన్నంగా కమ్యూనిస్టులు కష్టజీవుల ఐక్యతకు పెద్దపీట వేస్తారు. 1990, 1991 నుండి సరళీకరణ ఆర్థిక విధానాలు, అస్తిత్వవాద సిద్ధాంతాలు ప్రజా ఉద్యమాలకు పెద్ద సవాలుగా మారాయి. ఆయన జీవితకాలంలో మొదటి రోజుల్లో పోరాడినట్లే సరళీకరణ ఆర్థిక విధానాల మీద కూడా పోరాడారు. ప్రయివేటీకరణ అనివార్యమని, సహజీవనం తప్పదన్న సిద్ధాంతాన్ని చీల్చి చెండాడాడు. ఆయన ఆ రోజు చెప్పిందే ఈ 30 ఏళ్ళ చరిత్ర రుజువు చేస్తోంది. కాంగ్రెస్ తెచ్చిన భూ సంస్కరణలు గానీ, ప్రభుత్వ రంగ పరిశ్రమలుగానీ పూర్తిగా తిరగదిప్పబడుతున్న రోజులివి. ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని ఎదురొడ్డి పోరాడాలన్న ఆనాటి ఆయన విశ్వాసం బలపడుతున్న రోజులివి. ప్రజాశక్తి నేడు ఆయన వారసత్వాన్ని కొనసాగించడానికి పాటుపడుతోంది. నిన్నగాక మొన్న డిస్కాముల ప్రయివేటీకరణ, సామాజిక రాయితీల రద్దు, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు తగిలించి రైతుల గొంతులు తడిగుడ్డతో కోయడానికి పూనుకుంటున్న అంశాన్ని బట్టబయలు చేసింది. సంక్షేమం మరిచి రాయితీల రద్దు చేయాలని పూనుకుంటే తొలుత వెలుగులోకి తెచ్చింది ప్రజాశక్తి. ఇదే రీతిగా ఆస్తి పన్ను విధానాన్ని, పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలను ఎండగట్టింది ప్రజాశక్తి. ఇది మోటూరు హనుమంతరావు గారి వారసత్వమే.
కరోనా బాధితులకు సేవలు
సుందరయ్య, బసవపున్నయ్య, ఎం.హెచ్ రోజుల్లో కమ్యూనిస్టు విలువలు, సేవలు ప్రజల మన్ననలను పొందాయి. కరువు కాటకాలు, వరదలు, అంటువ్యాధులకు భారీ స్థాయిలో ఆ రోజుల్లో ఉద్యమంగా సేవలందించారు. సుందరయ్య, డాక్టర్ రామచంద్రారెడ్డి కలరా వచ్చినప్పుడు ఆస్పత్రి మూసివేసి, గ్రామాల్లో వైద్య బృందాలతో చేసిన సేవలు గొప్ప ఆదరణ పొందాయి. ఇప్పుడు కరోనా సేవల్లో పార్టీ చేస్తున్న కృషి ప్రజల మన్ననలు పొందుతున్నాయి. వలంటీర్ల ప్రాణాలే కాదు, వైద్యులు, నర్సుల ప్రాణాలు కూడా విలువైనవే. వారి సేవలు లేకుంటే చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఈ భావనతో మన వలంటీర్లు కరోనా ఐసొలేషన్ సేవల్లో చేస్తున్న కృషి గొప్పది. గొప్ప విలువలు, సేవలు జైల్లో ఎదురొడ్డి పోరాడిన ఎం.హెచ్ తెగింపును గుర్తుకు తెచ్చేదే.
కమ్యూనిస్టు ఆంతరంగిక జీవితం
కమ్యూనిస్టు ఉద్యమ ఆంతరంగిక జీవితంలో కామ్రేడ్‌షిప్ చాలా విలువైనది. సహచర కామ్రేడ్లతో సఖ్యతగా ఉండడం, గౌరవంగా ఉండడం ముఖ్యమైంది. లక్ష్యం కోసం ఉన్నారన్న అంశం సదా గమనంలో ఉంచుకొని వ్యవహరించడం ముఖ్యమైన అంశం. ఈ విషయాన్ని తు.చ తప్పక అమలు జరిపిన మంచి కమ్యూనిస్టు మోటూరు హనుమంతరావుగారు. ఎన్నో సంక్లిష్టమైన సందర్భాల్లో సైతం సహచర కామ్రేడ్లను గౌరవభావంతోనూ, ప్రేమాభిమానాలతోనూ చూసుకోవడంలో ప్రత్యేకశ్రద్ధ వహించేవారు. ఒకరోజు నేను టైఫాయిడ్ ట్రీట్‌మెంటులో ఉండి వస్తూ విజయవాడ రైల్వే స్టేషన్‌లో అపస్మారకంతో పడిపోయాను. రైల్వే అధికారులు రైల్వే ఆసుపత్రిలో చేర్చారు. హనుమంతరావుగారికి తెలిసింది. అది పొద్దుపోయిన సాయంకాలం సమయం. ఆయన ఆసుపత్రికి వచ్చి వాకబు చేశారు. మెల్లగా అపస్మారక స్థితి నుండి తేరుకుంటున్నా. ఆయన చూపిన ఆప్యాయత ఇప్పటికీ గుర్తుంది. అదేవిధంగా ఒకరోజు విజయవాడ కాలేజీలో నా మీద దాడి జరిగింది. మధ్యాహ్నం భోజనానికి సైకిల్ మీద వెళుతున్న ఎం.హెచ్ నన్ను చూసి దిగారు. సైకిల్ వెనక్కి తిప్పి ఆఫీసుకు వచ్చి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఒక పోరాటంలో, ఒక ఆందోళనలో సమస్య ఉత్పన్నమైనప్పుడు అవసరమైన రీతిలో ఎదుర్కోవడమేగాదు, ఓదార్చడంలోనూ, ధైర్యం ఇవ్వడంలోనూ ఆయనది ఒక ప్రత్యేక ఒరవడి. ఎన్నో ఉదాహారణలు ఉన్నాయి. ఆర్.ఎస్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో యావజ్జీవ శిక్ష పడి ఉన్నప్పుడు విచారణకు వెళ్ళారు. ఓదార్చిన ఘటన కొందరు కథలు కథలుగా చెప్పేవారు. ఈ రోజు ద్రవ్యపెట్టుబడి ఆధిపత్యం క్రింద దోపిడీని తీవ్రతరం చేసింది. దీన్ని ఎలా ఎదుర్కోవాలనే దాంట్లో కూడా సైద్ధాంతికంగా గొప్ప పాత్ర హనుమంతరావు గారిది. ఎంగేజ్‌మెంటు ద్రవ్యపెట్టుబడి రాజ్యంలో కుదరదు అన్న సిద్ధాంతానికి యం.హెచ్. కట్టుబడి పోరాడారు. మతోన్మాదం, కులతత్వం, ప్రాంతీయతత్వం లాంటి అస్తిత్వవాద పెడధోరణుల మీద రాజీ లేని పోరాటం చేశారు. ఈరోజు ప్రజాశక్తి ఈ కోవలోనే మంచి పాత్ర నిర్వహిస్తున్నది. ఆయన నమ్మిన ఈ విధానాలకు పునరంకితం కావడంతో పాటు, సైద్ధాంతిక నిబద్ధతతో మెలగడమే మోటూరుకు నివాళి.
/ వ్యాసకర్త సిపియం రాష్ట్ర కార్యదర్శి /
పెనుమల్లి మధు











