Jul 09,2023 20:38

బురద నీటిని చూపుతున్న విద్యార్థి

ప్రజాశక్తి - చిప్పగిరి
ఉదయం లేవగానే శుభ్రంగా స్నానం చేసి యూనిఫారం వేసుకుని వెళ్లే విద్యార్థులపై బురద నీరు పడుతోందని, గ్రామంలో సైడ్‌ కాలువలు నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రోజూ ఈ సమస్య తమకు ఎదురవుతోందని మండలంలోని నేమకల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు తెలుపుతున్నారు. నేమకల్లు గ్రామంలోకి పోవడానికి ప్రధాన రహదారిలో ఏరోజు కూడా మురుగనీనరు లేని రోజు లేదని, రహదారి వెంట వెళ్లే మహిళలు, ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారి వెంటే పాఠశాలలకు వెళ్లే బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు రద్దీ లేకుండా తిరుగుతూనే ఉంటాయి. రహదారి వెంట నడుచుకుంటూ వెళ్లే వారికి మురుకునీరు పడుతూనే ఉంటాయి. సర్దుకుపోయేవారు కొందరు. కోపగించుకుని పోయేవారు మరికొందరు. రోడ్డు ఇరువైపులా నివాసం ఉన్న వారంతా పోటీ పడి ఇంట్లోని బట్టలు ఉతికిన నీళ్లు, వేస్ట్‌ నీటిని రహదారులపైకి వదులుతున్నారు. మురుగునీటి వల్ల దోమలు వ్యాప్తి చెంది అంటువ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. వీరికి ఎన్నిసార్లు అవగాహన కల్పించినా, నోటీసులు ఇచ్చినా మారడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా కాలువలు నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.
రోజూ ఇబ్బంది పడుతూనే ఉన్నాం
- రామ్‌చరణ్‌ తేజ, పదో తరగతి విద్యార్థి, నేమకల్లు

రోజూ పాఠశాలకు వచ్చే రహదారిలో ఎంత జాగ్రత్తగా వచ్చినా ఏదో ఒక వాహనం ద్వారా మా యూనిఫారంపై బురద నీరు పడుతున్నాయి. పాఠశాలలోని ఉపాధ్యాయులకు, అధికారులకు తెలిపినా ఎవరూ పట్టించుకోవడం లేదు. రహదారికి ఇరువైపులా కాలువలు నిర్మించాలి.