Jun 13,2023 00:34

మాట్లాడుతున్న సిఐ ఉమేష్‌

ప్రజాశక్తి - పంగులూరు  :సైబర్‌ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అద్దంకి రూరల్‌ సిఐ ఉమేష్‌ తెలిపారు. పంగులూరులోని వేణుగోపాలస్వామి దేవాలయం వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో సిఐ మాట్లాడారు. ఇటీవల కాలంలో దేశంలోనూ, రాష్ట్రంలోనూ సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగాయన్నారు. దీంతో అమాయక ప్రజలునష్టపోతున్నారన్నారు. మనకు తెలియకుండానే మన బ్యాంక్‌ అకౌంట్‌లోని డబ్బు ఇతర ఖాతాలకు బదిలీ అవుతుందన్నారు. సెల్‌ఫోన్‌లో వచ్చే మెసేజ్‌లకు ప్రజలు ఆకర్షితులై తమ తెలియకుండానే సైబర్‌ నేరస్తుల చేతిలో మోసపోతున్నట్లు తెలిపారు. కొంతమంది విద్యార్థులను ఆటల పేరుతో ముగ్గులోకి దించి, వారి నుంచి లక్షల రూపాయలు సైబర్‌ నేరస్తుల ఖాతాల్లోకి జమ చేసుకుంటున్నట్లు తెలిపారు. వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డ యువతి యువకులు తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, వారిని ఆ వైపు పయనించకుండా చేసే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల జోలికి యువత వెళ్లకుండా జాగతం చేయాలన్నారు. గ్రామాల్లోకి ఎవరెవరు వస్తున్నారు? ఏమి చేస్తున్నారు, ఎవరైనా దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నారా, అనే విషయాలను శోధించేందుకు గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు గ్రామాల్లో శాంతి సంతోషాలతో ఉండేందుకు పోలీసు వ్యవస్థ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రేణింగవరం ఎస్‌ఐ తిరుపతిరావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.