ప్రజాశక్తి - బుక్కపట్నం : సైబర్ నేరాలపై మండల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మండల పరిధిలో గత కొన్ని రోజులుగా ఖాతాదారుల అకౌంట్ నుంచి ఉన్నపలంగా నగదు ఖాళీ అవుతున్నడంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఎటువంటి లావాదేవీలు జరపకుండానే నగదు ఖాళీ అయిపోతున్నడంతో ఎవరికి చెప్పాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. గత నెల రోజుల నుంచి స్థానిక స్టేట్ బ్యాంక్ ఖాతాదారుల్లో దాదాపు పదిమంది ఖాతాదారుల నుంచి నగదు ఖాళీ అవుతుండడంతో కొందరు బ్యాంక్ అధికారులను సంప్రదించారు. ఎక్కడైనా వివిధ కారణాల చేత వేలిముద్రలు వేసినప్పుడు జాగ్రత్త వహించాలని వేలిముద్రలు వేసిన కొద్దిరోజుల తర్వాత అకౌంట్ నుంచి అమౌంటు ఉన్నపలంగా ఖాళీ అవుతుంటే అకౌంటు సైబర్ నేరానికి గురైందని గ్రహించి వెంటనే సంబంధిత బ్యాంకు నందు సంప్రదించాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. ఆధార్ కార్డు వివరాలు డిలిమినేషన్ చేసుకోవాలన్నారు. ఖాతాదారుల నుంచి లిఖితపూర్వకంగా వివరాలు తీసుకొని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సైబర్ క్రైమ్ కు గురి అయ్యుంటే మూడు నెలల లోపు నగదును ఖాతాదారుల అకౌంట్లోకి జమ అయ్యే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామానికి చెందిన సంజీవ రాయుడు అనే వ్యక్తికి స్టేట్ బ్యాంక్ నందు అకౌంట్ ఉండగా అతనిఅకౌంట్ నుంచి 12వ తేదీ న పదివేల రూపాయలు, 13వ తేదీన 10 వేల రూపాయలు ఉన్నపలంగా విత్‌డ్రా అయింది. దీంతో బ్యాంక్ అధికారులు సంప్రదించగా అకౌంటు సైబర్ నేరానికి గురైందని తెలిపి ఆధార్ కార్డు డిలిమినేషన్ చేసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా స్టేట్‌బ్యాంకు అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ ఖాతాదారులు ఎక్కడైనా వేలిముద్రలు వేసిన తరువాత అకౌంట్ నుంచి నగదు ఖాళీ అయినచో వెంటనే బ్యాంకును సంప్రదించి తమ ఆధార్ కార్డును డిలిమినేషన్ చేసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.ఉన్నఫలంగా నగదు ఖాళీ అయితే ఖాతాదారుల నుంచి లిఖితపూర్వకంగా రాయించుకొని పై అధికారులకు సమాచారం అందించి మూడు నెలల లోపు నగదును జమ చేయడం జరుగుతుందని తెలిపారు.










