Nov 30,2022 23:35

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కంప్యూటర్‌ భద్రతా దినోత్సవం సందర్భంగా సైబర్‌ సెక్యూరిటీ -ఎథికల్‌ హ్యాకింగ్‌ అనే అంశంపై అతిద్యోపన్యాసం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌ తెలిపారు. సుప్రజా టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు చలువాది సంతోష్‌ సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన నేరాలు, ఆఫర్లు పేరిట మొబైల్‌ ఫోన్లకు పంపించే నకిలీ సందేశాలు, బ్యాంకు ఖాతా నంబర్లు, పాస్‌వర్డ్‌, ఆధార్‌ నంబర్లు వంటి కీలక సమాచారాన్ని తస్కరించటానికి సైబర్‌ నేరగాళ్లు అనుసరించే విధానాలపై అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో నకిలీ ఫేస్బుక్‌ ఖాతాలు సష్టించి వారి పరిచయస్తులందరికీ ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి యాప్‌ల ద్వారా నగదు బదిలీ చేయమని సందేశాలు పంపటం సర్వ సాధారణంగా మారిందని దీనిని నివారించటానికి ఫేస్‌బుక్‌ ఖాతాదారులు తమ ఎకౌంట్లను లాక్‌ చేయడం ద్వారా పదిల పరచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ఉపాధి అవకాశాల గురించి తమ సందేహాలను సంతోష్‌ ద్వారా నివత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ టి.ఎస్‌.రవికిరణ్‌, శిక్షణా ఉపాధి విభాగాధికారి కావూరి శ్రీధర్‌, ఇంచార్జ్‌ కోనేరు సుధీర్‌ పాల్గొన్నారు.