Sep 23,2023 20:11

బొబ్బిలి: మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి టి. వాసుదేవన్‌

ప్రజాశక్తి- బొబ్బిలి : సైబర్‌ నేరాలకు పాల్పడితే మూడేళ్లు జైలుశిక్ష, రూ.2లక్షల వరకు జరిమానా పడుతుందని సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.వాసుదేవన్‌ అన్నారు. ఎస్‌ఎస్‌ఎస్‌ డిగ్రీ కళాశాలలో రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో శనివారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌ ఫోన్లు వినియోగం పెరగడంతో పాటు ఎలక్ట్రానిక్‌ టెక్నాలజీ పెరగడం వల్ల సైబర్‌ నేరాలు పెరిగిపోయాయని అన్నారు. సైబర్‌ నేరాలను నివారించేందుకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ను 2000 సంవత్సరంలో తీసుకువచ్చినట్లు చెప్పారు. రెచ్చగొట్టే మాటలను, కించపరిచే మాటలను ఆడియో, వీడియోలను సామాజిక మీడియాలలో ప్రచారం చేస్తే మూడేళ్లు జైలు శిక్ష, రూ.2లక్షల వరకు జరిమానా ఉంటుందన్నారు. వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిస్తే కఠిన శిక్ష ఉంటుందన్నారు. విద్యార్థి దశలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నేరాలకు పాల్పడితే ర్యాగింగ్‌ కింద పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌కు దూరంగా ఉండాలన్నారు. రాజ్యాంగానికి లోబడి చట్టాలను చేయాలన్నారు. చట్టాలకు లోబడి ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. వాసు విద్యా కరస్పాండెంట్‌ రౌతు వాసుదేవరావు మాట్లాడుతూ చదువు జ్ఞానాన్ని పెంచడంతో పాటు వ్యక్తిగత, కుటుంబ, సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకోవాలని కోరారు. విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేసేందుకు రోటరీ క్లబ్‌ పని చేస్తుందని రోటరీ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు జేసీ రాజు, వి.శ్రీహరి, రీజనల్‌ చైర్‌ తూముల కార్తీక్‌, ట్రెజరర్‌ శ్రీనివాస్‌ అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నందిగాం గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
డెంకాడ (భోగాపురం) : నందిగాం గ్రామాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా జడ్జి సాయి కళ్యాణ్‌ చక్రవర్తి అన్నారు. న్యాయ సేవా సదన్‌ ఆధ్వర్యంలో శనివారం నందిగాలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సాధారణంగా జిల్లాలోనే అన్ని విభాగాల్లో వివాద రహిత గ్రామంగా గుర్తించిన నందిగాం గ్రామానికి ముందుగా శుభాభినందనలు తెలిపారు. న్యాయసేవా సదన్‌ అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా వివాదాలు ఉండే గ్రామాల్లో మాత్రమే నిర్వహిస్తామని ఎందుకంటే వారికి అక్కడ ఉన్న ప్రజలకు వివాదాల్లోకి వెళితే మున్ముందు కుటుంబ ఆర్థిక నష్టాలు ఎంత తీవ్రంగా ఉంటాయో, చట్టాలపై అవగాహన కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామని అన్నారు. కానీ న్యాయ సేవా సదన్‌ తరుపున వివాద రహితంగా ఉన్న గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ఉన్న గ్రామ పరిస్థితులు, ప్రజలను, నాయకత్వాన్ని చూస్తూ ఉంటే ముచ్చటేస్తుందన్నారు. ఈ గ్రామంలా మిగతా గ్రామాలన్నీ మారాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా చట్టాలపై అవగాహన పెంచుకొని, వివాదాలకు దూరంగా ఉండాలని కోరారు. నందిగాం గ్రామాన్ని జిల్లాలో అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతి పౌరుడు వివాదాలకు దూరంగా ఉండాలన్నారు. ఇక్కడ మహిళా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను వారు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తులను చూసి పట్టణాలలో ఇటువంటి ఉత్పత్తులు చేయాలన్నారు. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా వ్యాపార విస్తరణ చేస్తే వారికి ఆర్థిక పరిపుష్టి కలుగుతుందన్నారు. జిల్లా న్యాయ సేవా సదన్‌ జడ్జ్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ నందిగాం వంటి గ్రామంలో సమావేశం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ సిహెచ్‌ బంగారు రాజు, సిఐ వెంకటేశ్వరరావు, ఎంపిడిఒ అప్పలనాయుడు, అడ్వకేట్స్‌ సత్యం, కుమార్‌, మూడు మండలాల ఎస్‌ఐలు, సచివాలయ సిబ్బంది, ఐసిడిఎస్‌, వెలుగు సిబ్బంది మహిళా సంఘం సభ్యులు తోపాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.