Oct 18,2023 22:57

 ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌ కుమార్‌
ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : సైబర్‌ నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఏలూరు రేంజ్‌ డీఐజీ జి.వి.జి అశోక్‌ కుమార్‌ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం దిశా , ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ను తనిఖీ చేసి రికార్డు పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డిజిపి ఆదేశాల మేరకు శాంతి భద్రతలు అదుపు చేస్తున్నామన్నారు. అలాగే సైబర్‌ నేరాలు నియంత్రణకు ఇప్పటికే పటిష్టవంతమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పోలీస్‌ స్టేషన్‌ కు ఇద్దరు కానిస్టేబుల్‌ కు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం భార్యాభర్తల కేసులు పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి కేసు నమోదు చేసి కౌన్సిలింగ్‌ ఇస్తామన్నారు. దిశా పోలీస్‌ స్టేషన్లో అధికారులు, సిబ్బంది పనితీరు బాగుందని కితాబు ఇచ్చారు.అలాగే రికార్డులు నిర్వహణ పై సంతృప్తి వ్యక్తం చేశారు.. ఇటీవల మొబైల్‌ ఫోన్ల వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వాటి పట్ల యువతి ,యువకులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే కళా శాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తా మన్నారు. అలాగే చిన్న పిల్లలకు గుడ్‌ టచ్‌ ,బ్యాడ్‌ టచ్‌ ల పై అవగాహాన కల్పిస్తామన్నారు. అదేవిధంగా గంజాయి నియంత్రణకు కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో గంజాయిని నియంత్రించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి.జాషువా, ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.