ప్రజాశక్తి-తెనాలి : ధాన్యాగారంగా పేరొందిన కృష్టా డెల్టా పరిధిలో రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో దాదాపు ఐదు లక్షల ఎకరాలకు పైగా వరి సాగవుతుంది. నిన్నమొన్నటి వరకూ వర్షాల కోసం ఎదురు చూసిన రైతులు ఇప్పుడిప్పుడే పడుతున్న తొలకరి జల్లులతో సాగుకు శ్రీకారం చుడుతున్నారు. రబీలో అకాల వర్షాలకు రైతులు పూర్తిగా దెబ్బతినగా ఆ నష్టాల ఊబిలో నుంచి కోలుకోక ముందే ఖరీఫ్‌కు సాగుకు సిద్ధడుతున్నారు.
జూన్ తొలి వారంలోనే ఖరీఫ్ సాగు పనుల్లో రైతులు నిమగమవాల్సి ఉన్నా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలతో కొంత ఆలస్యమైంది. ప్రతి ఏటా జూన్ 10, 12 తేదీల్లో సాగునీరు విడుదలతుంది. అయితే ఈ ఏడాది ఇటీవల మంత్రి రాంబాబు నీటిని లాంఛనంగా విడుదల చేసినా అవి కాల్వలకు రాలేదు. మరోవైపు పంటకాల్వలు, మురుగు కాల్వల్లో తూటికాడ, గుర్రపుడెక్క పెరిగిపోయింది. కొన్నిచోట్ల గడ్డి మందు చల్లించి మిన్నకుంటున్నారు. కొన్నిచోట్ల కాల్వలు సరిచేయలేదు. ఈ పరిస్థితుల్లో సాగునీరు విడుదలైనా దిగువ ప్రాంతాలకు చేరే పరిస్థితిలేదు. అయినా రైతులు మాత్రం ఇప్పటికే కొందరు దుక్కి దున్నారు. మరికొంత మంది దుక్కి దున్నే పనిలో నిమగమయ్యారు. వర్షాలు, సాగు నీటి కోసం ఎదురు చూస్తున్నారు.
కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరం..
సాగుకు సమాయత్తం కావాలంటే పెట్టుబడి, విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి రావాలి. అయితే విత్తు నుంచి పంట కొనుగోలు వరకూ రైతు భరోసా కేంద్రాలు అండగా ఉంటాయని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. వరి విత్తనాలు ఇప్పటికీ రైతు భరోసా కేంద్రాలకు చేరలేదు. ఎరువుల సంగతి సరేసరి. భూమి సారవతం కోసం దుక్కిలో కలిపి దున్నే పిల్లిపెసర, జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట విత్తనాలే ఆర్బీకేల ద్వారా ప్రస్తుతం అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా అకాల వర్షాలకు తడిసిన రబీ పంటలైన జొన్న, మొక్కజొన్నను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అదీ తూతూమంత్రంగానే ముగించింది. ఈ నేపథ్యంలో రబీ నష్టం నుంచి కోలుకోకుండానే కౌలు రైతులు ఖరీఫ్‌పై దృష్టి సారించాల్సి వచ్చింది. దీనికితోడు కౌలు రైతు గుర్తింపు కార్డులు సకాలంలో తీసుకుంటే పెట్టుబడికి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. కాని కౌలు రైతు గుర్తింపు కార్డు పొందాలంటే భూ యజమాని అనుమతి లభించటం కౌలు రైతులకు శాపంగా మారింది. దీంతో పెట్టుబడులతోపాటు కౌలు చెల్లింపు కోసమూ కౌలు రౌతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ సహకారమే లేదు
మేకల చిట్టిబాబు, కౌలురైతు
గతేడాదితో పోలిస్తే వాతావరణంలో చాలా తేడా ఉంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులు, సాగునీటి విడుదల జాప్యాల మధ్య ఇప్పుడిప్పుడే సాగుకు సిద్ధమవుతున్నాం. మాకు ప్రభుత్వ సహకారమేమీ లేదు. రబీలో తడిసిన మొక్కజొన్న కొనుగోలు చేస్తామని మొండి చెయ్యి చూపింది. సవాలక్ష ఆంక్షలతో కొనుగోలు చేసిన వాటికి చెల్లింపుల్లోనూ జాప్యమే. వెద పద్ధతిలో సాగు చేసే వరికి సకాలంలో నీరు అవసరం. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే రైతులకు ఆదిలోనే సమస్యలు ఎదురవుతాయి.
పూడిక తీత లేదు.. విత్తనాల్లేవు..
ములకా శివసాంబిరెడ్డి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు
ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా సాగునీటి విడుదల చర్యల్లేవు. పంట కాల్వల్లో తూటికాడ, గుర్రపుడెక్క తొలగించలేదు. కొన్నిచోట్ల గడ్డిమందు చల్లి వదిలేశారు. తీరా సాగునీరు విడుదలయ్యాక కాంట్రాక్టర్లకు అప్పగించి, తూతూ మంత్రంగా పనులు చేయించటం ఆనవాయితీగా మారింది. కృష్ణాడెల్టా దిగువ ప్రాంత రైతులకు సాగునీరు లభ్యతలో తీవ్ర జాన్యం నెలకొంటుంది. విత్తనాలు ఇప్పటికీ రైతు భరోసా కేంద్రాలకు చేరలేదు. 2011 కౌలు రైతు చట్టాన్ని రద్దుచేసి, ఆ స్థానంలో 2019 చట్టం తెచ్చిన కారణంగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు దక్కే పరిస్థితిలేదు. భూయజమాని అంగీకారం, సంతకం ఉంటే తప్ప కౌలు రైతుకు గుర్తింపు కార్డు రాదు. కనీసం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లభిస్తే వారికి కొంత వెసులుబాటు కలిగినట్టే.
వరి విత్తనాలకు ఇండెంట్ పెట్టాం
జి.ప్రేమ్‌సాగర్, మండల వ్యవసాయాధికారి, తెనాలి.
ఖరీఫ్ సాగుకు వరి విత్తనాలు ఆర్బీకేలకు చేరలేదు. ప్రభుత్వానికి ఇండెంట్ పంపించాం. ప్రస్తుతం రైతులకు పిల్లిపెసర, జీలుగ, జనుము వ్తితనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇస్తున్నాం. భూసార పరీక్షల నిమిత్తం మండలం మొత్తం మీద దాదాపు 750 మట్టి నమూనాలను సేకరించి గుంటూరు ల్యాబ్‌కు పంపాం. ఖరీఫ్ సాగుకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం.
తూర్పు డెల్టాకు నీరు
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి
తూర్పు డెల్టాకు బుధవారం 1705 క్యూసెక్కులు విడుదల చేయగా పశ్చిమ డెల్టాకు 516 క్యూసెక్కుల నీటిని డెల్టాలోని వివిధ కాల్వలకు విడుదల చేశారు. డెల్టా సెంట్రల్ సబ్ డివిజన్ ప్రధాన కేంద్రం దుగ్గిరాల మీదుగా బకింగ్ హామ్ కెనాల్ నుంచి కొమ్మమూరు కాల్వకు నీరు చేరింది. నిజాంపట్నం తూర్పు పడమర పడవల కాల్వతో పాటు పంట కాల్వలకు నీటిని పంపుతున్నారు. మరమ్మతులు పూర్తికా కుండానే నీరు విడుదల చేయడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి 900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా పులిచింతల నుంచి 4200 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఇందులో 1051 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజికి చేరుతున్నాయి. కృష్ణాపశ్చిమ డెల్టా, గుంటూరు ఛానల్, సాగర్ ఆయకట్టు పరిధిలో కాల్వల నిర్వహణ, తూటికాడ, గుర్రపు డెక్కపనులకు టెండర్లు ఖరారవ్వని నేపథ్యంలో ముందస్తుగా నీరు విడుదల చేసినా చివరి భూములకు నీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది










