May 04,2023 00:13

పెదకూరపాడులో మిర్చిపంటపై కప్పిన పట్టాలు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవి ఇంకా వారం పాటు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. రబీలో సాగు చేసిన వరి, జొన్న, జొన్న, అపరాలు, ఉద్యాన పంటలకు అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన మిర్చి, పసుపు, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చిని కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
గుంటూరు జిల్లాలో తాడేపల్లి మండలంలో 15 ఎకరాల్లోనే అరటి తోటలు దెబ్బతిన్నట్లు అధికారులు నిర్ధారించారు. పల్నాడు జిల్లాలో కోయకుండా ఉంచి వరి పంట 675 ఎకరాల్లోనే నష్టం జరిగిందని అధికారులు నివేదిక రూపొందించారు. పల్నాడులో 75 ఎకరాల్లోనే మొక్కజొన్నకు నష్టం వాటిల్లిందని నిర్ధారించారు. రైతులకు జరిగిన నష్టంలో నిబంధనల ప్రకారం సాయం అందే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పంటలు కోసిన తరువాత వర్షాలకు నష్టం జరిగినా పరిహారం దక్కే అవకాశం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మిర్చి, జొన్న, మొక్కజొన్న కోసం కళ్లాల్లో ఆరబెట్టే పరిస్థితి నెలకొంది. ఇందువల్ల ఈ రైతులకు పరిహారం లభించే అవకాశం లేదంటున్నారు.
గుంటూరు జిల్లాలో రబీలో 23 వేల ఎకరాల్లో జొన్న, 60 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 82వేల ఎకరాల్లో ముతకధాన్యాలు, శనగ 18 వేల ఎకరాల్లో, పెసర 20 వేల ఎకరాల్లో, మినుము 11 వేల ఎకరాల్లో వేశారు. వీటిల్లో 20 శాతం పంట చివరి కోతల సమయంలో అకాల వర్షాలవల్ల నష్టంజరిగిందని అధికారులు అంచనావేసినా వీటికిసాయం అందందని చెబుతున్నారు. పల్నాడు జిల్లాలో వరి 50 వేల ఎకరాలు, మొక్కజొన్న 34 వేల ఎకరాలు, ముతక ధాన్యాలు 30 వేల ఎకరాలు, శనగ 19 వేల ఎకరాల్లో సాగు చేశారు. కొన్ని ప్రాంతాల్లో పంట కోత దశలో ఉండగా మరి కొన్ని ప్రాంతాల్లో కోసి కుప్పలు వేసి ఉంచగా వర్షాల వల్ల తడిసింది. గుంటూరు, పల్నాడు జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా నాలుగో విడత కోసిన మిర్చి కళ్లాల్లో ఆరబోసి ఉంచగా వర్షాలకు తడిసి నష్టం వాటిల్లింది. ఆలస్యంగా సాగు చేసిన ప్రాంతాల్లో నాలుగో విడత కోత పూర్తి కాకుండానే పంట దెబ్బతింటోంది.
బుధవారం జిల్లాలోని వివిధప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. పత్తిపాడు, మంగళగిరి, తెనాలి, గుంటూరు, పొన్నూరు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు... గురజాల 40.2. మిల్లీమీటర్లు, దాచేపల్లి 28.2, కారంపూడి 63.6, పిడుగురాళ్ల 80.2, మాచవరం 30.4, బెల్లంకొండ 38.2, అచ్చంపేట 22.6, క్రోసూరు 24.6, అమరావతి 40.8, గుంటూరు 24.8, పొన్నూరు 23.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.