నవ కోమల వసంత పాదాలకు
పారాణి పూసుకుని
జ్యోతిరావు ఫూలే
పుష్కరిణి జ్ఞాననదిలో
''సావిత్రిబాయి ఫూలే''గా
వికసించావు.
పెనిమిటి విద్యాసుద్దులను
వేళ్ళ మధ్య సుద్దలుగా మొలిపించావు
ఆధునిక స్త్రీ విద్య పిడి రూపమై
నిరక్షరాస్యత వృక్షాలకు గొడ్డలిపెట్టయ్యావు.
సతీసహగమనంపై నిరసన జ్వాలై
వితంతు శిరోముండనంపై కత్తెర వేటయ్యావు
''సిగ్గులేదా?''-అని ప్రశ్నించిన
ఆధిపత్య వర్గాలకు
నా విధిని నేను నిర్వర్తిస్తున్నానని
సగర్వ సమాధానమయ్యావు.
జాగృతమథనంలో కలం ఝళిపించి
''కావ్య ఫూలే'' కవితా సంపుటై మెరిశావు
అన్నార్తుల నోటికి మెతుకై
నిరక్షరాస్యులకు అక్షరామృతమయ్యావు.
ప్లేగు కోరల్లో పూణే మృత్యుదిబ్బపై
కాళీయ మర్దనం చేసి ఎందరో
అభాగ్యుల ప్రాణాలకు ప్రాణమై
కష్టాలను ఇష్టాలహారంగా ధరించావు.
దీనజనోద్ధరణకు నడుం బిగించి
సామాజిక స్పృహ కాంతులు పంచి
''క్రాంతిబాయి''గా భారతీయ విద్యావినీలాకాశంలో
ధృవతారగా నిల్చావు.
నీ సేవాతత్పరత నేటి మహిళలకు ఆదర్శం
నీ విద్యా పటిమ నేటి యువతకు మార్గదర్శకం.
సావిత్రీ! వినీల విద్యాజగతికి
నీ ఆదర్శం సామాజిక చైతన్య క్రాంతి.
- డా|| పెంకి విజయకుమార్,
సెల్ : 95533 92949










