ప్రజాశక్తిు-కొత్తకోట:చెరకు రైతుల సౌకర్యార్థం టి.అర్జాపురం - దొండపూడి గ్రామాల మధ్య చక్కర ప్యాక్టరీ ఆధ్వర్యంలో శాశ్వత చెరకు కాటా ఏర్పాటు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది సీజన్లో చెరకు సేకరణ నిమిత్తం రావికమతం మండలం దొండపూడి సమీపంలో మోదమాంబ ధర్మకాట వద్ద తాత్కాలిక చెరుకు సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చొరవతో గత డిసెంబర్ నెల 25న ప్రారంభించిన ఈ తాత్కాలిక చెరకు కాటా దొండపూడి, కిత్తంపేట, టి.అర్జాపురం,కొత్తూరు, పి.పొన్నవోలు, మత్యవానిపాలెం తదితర గ్రామాల చెరుకు రైతులకు తాత్కాలికంగా ఉపయోగ పడుతుంది. ఈ ప్రాంతంలో శాశ్వత చెరకు కాటాను ఏర్పాటు చేయాలని సభ్య చెరకు రైతులు గట్రేడ్డి వెంకటరావు, వడ్డాది శ్రీను, రాజాన తాతలు, కర్రీ అప్పారావు చక్కర కర్మాగారం అధికారులను కోరుతున్నారు.
రావికమతం సమీపంలో చెరకు కాటా లేక చోడవరం చక్కర కర్మాగారానికి చెరకు తరలింపునకు రవాణా పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ఈ సమస్యల కారణంగానే చెరుకు పంటపై స్థానిక సభ్య రైతులు అనాసక్తి చూపుతున్నారని, కర్మాగారం అధికారులు చొరవ తీసుకొని చెరుకు రైతుల సౌకర్యార్థం అర్జాపురం లేక దొండపూడి గ్రామాల మధ్యలో శాశ్వతంగా చెరకు కాటాను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విషయమై చక్కర కర్మాగారం సిడిఓ కె.రామం, ఫీల్డ్ ఆఫీసర్ పులగాయల సత్యనారాయణలను వివరణ కోరగా చెరకు రైతుల సౌకర్యం కోసం కర్మాగారం అధికారుల సూచినల మేరకు ప్రయివేట్ ధర్మ కాటా వద్ద సేకరణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కేంద్రం ద్వారా సీజనల్‌గా సభ్య రైతుల నుంచి సుమారు 2 వేల టన్నులు చెరకు సేకరణకు ప్రణాళిక చేశామని అయితే ఇప్పటికే కేవలం 20 రోజులలో సుమారు 11 వందల టన్నులు చెరకు సేకరణ చేశామని చెప్పారు. రైతుల విజ్ఞప్తి మేరకు శాశ్వత కాటా ఏర్పాటుకు అధికారులకు సిపార్సు చేస్తామని వారు పేర్కొన్నారు.










