Feb 23,2023 23:37

ఆందోళనలో పాల్గొన్న నేవీ నిర్వాసితులు

116వ రోజుకు నేవీ నిర్వాసితుల ఆందోళన
ప్రజాశక్తి- రాంబిల్లి

ప్రత్యామ్నాయ నావికా స్థావరం నిర్మాణానికి సర్వం కోల్పోయిన తమకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎన్‌ఎఒబి నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని వాడనర్సాపురం వద్ద నేవీ ప్రధాన గేట్‌ ముందు 8 గ్రామాల ఎన్‌ఎఒబి నిర్వాసితులు చేస్తున్న ఆందోళన గురువారం నాటికి 116వ రోజుకు చేరింది. రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేవీ నిర్మాణంతో సముద్రంలో చేపల వేట సాగక తమ ఉపాధి పోయిందని, తమ కుటుంబాల జీవనం సాగడం లేదని వాపోయారు. కేజీ పాలెం, గోవిందపాలెం, కొత్తపేట, చిన్న కలవలపల్లి, వాడ రాంబిల్లి, వాడ నరసాపురం, కొత్తపట్నం గ్రామాల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమకు జీవన భృతి కల్పించాలని, జెట్టీ నిర్మాణం చేపట్టాలని, అంత వరకు నేవీ గేట్‌ లోపల నుంచి ఆధార్‌ కార్డు ఆధారంగా చేపల వేటకు అనుమతి ఇవ్వాలని, పెండింగ్‌ ప్యాకేజీలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 8 గ్రామాలీ నిర్వాసితులు, జెఎసి పెద్దలు పాల్గొన్నారు.