గుంటూరు లీగల్: ప్రజా సేవలు అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సంబంధించిన వివాదాలను జిల్లా కోర్టు సముదాయంలోని శాశ్వత లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని పర్మినెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ చైర్మన్ పి.వి.రాంబాబు తెలిపారు. శనివారం జిల్లా కోర్టు అవరణలో న్యాయసేవా సదనంలో పి.వి.రాంబాబు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ జి.చంద్రమౌళీశ్వరి, బార్ అసోసియన్ అధ్యక్షులు సురేష్‌తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాంబాబు మాట్లాడుతూ లీగల్ సర్వీసెస్ ఆథారిటీ యాక్ట్-1987 ప్రకారం ఏర్పాటైన ఈ అదాలత్‌లు 10 నోటిఫైడ్ పబ్లిక్ యుటిలిటీ సేవలకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తున్నాయన్నారు. వాటిల్లో వాయు/రోడ్డు/ నీటి ద్వారా ప్రయాణికులు, వస్తువుల రవాణాకు రవాణా సేవ, పోస్టల్/టెలీగ్రాఫ్/ టెలీఫోన్ సేవ, విద్యుత్ కాంతి, నీటి సరఫరా సంస్థల సేవలు, ప్రజా పరిరక్షణ లేక పారిశుధ్య సేవలు, హాస్పిటల్, డిస్పెన్సరీ సేవలు, బీమా సేవలు, బ్యాంకింగ్, ఫైనాన్స్ సేవలు, విద్యా సేవలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం సేవలు, గృహ, రియల్ ఎస్టేట్ సేవలు ఉన్నాయన్నారు. ఆయా సేవలకు సంబంధించి వినియోగదారులకు, ఆయా సంస్థలకు గల వివాదాలను ఎటువంటి కోర్టు ఫీజుగానీ, ఖర్చులు గానీ లేకుండా 'పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్' ద్వారా సత్వరం పరిష్కారం పొందవచ్చన్నారు. ఈ సేవలకు సంబంధించి కోర్టులలో వ్యాజ్యం దాఖలు చేయకముందే, 'పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్' ను సేవా వినియోగదారులతోపాటు, సంస్థలు అశ్రయించవచ్చన్నారు. వివాదాలను రాజీ మార్గం ద్వారా పరిష్కరించటానికి ప్రయత్నించి, రాజీ ద్వారా పరిష్కారం కాని పక్షంలో, ప్రవేశపెట్టబడిన సాక్ష్యాధారాలను అనుసరించి వివాదాలను పరిష్కరించి తీర్పు వెలువరిస్తుంది. అలాంటి తీర్పుపైన అప్పీల్ చేయటానికి వీలు లేదన్నారు. జిల్లా కోర్టు అవరణలోని నూతన భవన సముదాయం, రెండవ అంతస్తులో శాశ్వత లోక్ అదాలత్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ విధులు నిర్వహిస్తుందన్నారు. జిల్లాలో శాశ్వత లోక్ అదాలత్ ఎర్పాటు చేసిన 2003 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు 3000 కేసులు వరకు పరిష్కరించినట్లు చెప్పారు. ప్రజలు ఈ శాశ్వత్ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం న్యాయసేవాధికార సంస్థ భవనంలో పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్‌పై పర్మినెంట్ పి.వి. రాంబాబు ప్యానల్ అడ్వకేట్స్‌కు ప్రోబోను లాయర్లకు అవగాహన కల్పించారు.










