Sep 26,2023 22:03

పేదలతో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి- చిలమత్తూరు : ప్రభుత్వం అధికారం లోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఇళ్ల స్థలాలు మంజూరు చేసి మూడేళ్లు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు కాబట్టే ప్రభుత్వం పేదలకు కేటాయించిన స్థలాన్ని పేదలు స్వాధీనం చేసుకున్నారని ఇక్కడ శాశ్వత ఇళ్ల నిర్మాణాలు చేపడతామని వ్యకాసం జిల్లా కార్యదర్శి పెద్దన్న, అధ్యక్షులు ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వమే లేఅవుట్‌ వేసి ప్రభుత్వమే లబ్దిదారులను గుర్తించి, పట్టాలు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదో అంతు చిక్కని ప్రశ్నగా ఉందని అన్నారు. అధికారుల వైపల్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదో లేక ప్రభుత్వమే పేదలకు విలువైన భూమిని ఇవ్వొద్దని అధికారులను ఆదేశించిదో అంతు చిక్కడం లేదని అన్నారు. స్థానికంగా ఉన్న పేదలు సెంటున్నర ఇంటి స్థలం కోసం పోరాటం చేస్తుంటే అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా రియాల్టర్లతో కార్యాలయాలలో గంటల కొద్ది సమావేశాలు వేస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. చిలమత్తూరు మండలంలో వేల ఎకరాలు సెజ్‌ పేరుతో బడాబాబులకు అప్పగించిన ప్రభుత్వం పేదలకు ఇంటి నిర్మాణం కోసం భూమి ఇవ్వమంటే నిర్బందాలు అరెస్టులు చేసి బయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. పుట్టపర్తి జిల్లా వ్యాప్తంగా ఇంటి స్థలాల కోసం పేదలు నడుం బిగిస్తున్నారని చెప్పారు. సోమందేపల్లి నక్కలగుట్ట,పెనుకొండ ప్రాంతంలోని భూమిని స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం ,జిల్లా పరిపాలన యంత్రాంగం వెంటనే స్పందించి ఇళ్లు లేని పేదలకు వెంటనే పట్టాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ, సిపిఎం నాయకులు సోమందేపల్లి రంగప్ప రమేష్‌, చంద్ర, ఆనంద్‌, సదాశివరెడ్డి, నరసింహా, రియాజ్‌, శివ, హనీప్‌, రఫిక్‌, రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.