
ప్రజాశక్తి-పొన్నూరు రూరల్ : పొన్నూరులో శాశ్వత ఆటోనగర్ అభివృద్ధి కార్మికుల అందరి లక్ష్యమని పొన్నూరు శాశ్వత ఆటోనగర్ సాధన యూనియన్ అధ్యక్షులు ఎమ్‌డి ఉస్మాన్ మేస్త్రి అన్నారు. ఈ మేరకు బాపట్ల రోడ్డులో యూనియన్ కార్యాలయాన్ని షేక్ సుభాని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉస్మాన్ మేస్త్రి మాట్లాడుతూ 25 ఏళ్లుగా పొన్నూరులో శాశ్వత ఆటోనగర్ ఏర్పాటు కోసం పోరాడుతున్నామన్నారు. ఆటోనగర్ కార్మికుల కల సాకారమయ్యేదాక ఉద్యమిస్తామని చెప్పారు. 250 మందికి పైగా కార్మికుల కుటుంబాలు మూడు దశాబ్దాలుగా రోడ్లకు ఇరువైపులా వివిధ వృత్తుల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఆటోనగర్ కోసం ప్రభుత్వాలకూ నివేదించామని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి 20 ఎకరాల్లో శాశ్వత ఆటోనగర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎండోమెంట్ భూములు లీజు ప్రాతిపదికపై ఆటోనగర్ ఏర్పాటు ద్వారా కార్మికులకు ప్రయోజనం ఉండదని, భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో బాబు మేస్త్రి, ఎం.శ్రీను, జిలాని, సిరాజ్, కాలేషా, శ్రీనివాసరావు, బాషా పాల్గొన్నారు.