ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్: మిర్చిలో శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని గుంటూరు లాం మిర్చి శాస్త్రవేత్త సివి రమణ సూచించారు. ఇంకొల్లు మండలం లోని గంగవరం మంచాల వెంకట్రామయ్య, రంగయ్య కళ్యాణ మండపంలో మంగళవారం ఏర్పాటు చేసిన మిర్చి రైతుల అవగాహన సదస్సులో రమణ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మిర్చి పంట సాగు విధానం, మిర్చి పంటలపై ఆశించే తెగుళ్లు, నల్ల తామర, చీడ పీడల నివారణ గురించి రైతులకు వివరించారు. గత రెండు సంవత్సరాలుగా మిర్చి పంట తెగుళ్లతో బాపట్ల జిల్లాలో మిర్చి రైతులు నష్టపోయారన్నారు. ప్రధానంగా ఇంకొల్లు మండలంలో అధికంగా సాగు చేసిన మిర్చి రైతులు అప్పులపాలైన సంగతి తమ దృష్టికి రైతు సంఘం తీసుకు వచ్చిందన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వలేటి కృష్ణయ్య రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని కోరటంతో శాస్త్ర వేత్తల బృందం గంగవరం వచ్చామన్నారు. బాపట్ల జిల్లా ఉద్యాన శాఖ జెడిఏ పి జెన్నెమ్మ మాట్లాడుతూ విత్తన ఎంపిక సమయంలోనే రైతులు మంచి విత్తనాలు ఎంపిక చేసుకోవాలని అన్నారు. నర్సరీలు ఈపాటికే తనిఖీలు చేస్తున్నామని వివరించారు. ఎవరైనా నకిలీ నారు అమ్మినట్లు తమ పరిశీలనలోకి వస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వలేటి కృష్ణయ్య మాట్లాడుతూ శాస్త్రవేత్తల సలహాలతో రైతులు తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు వచ్చే విధంగా చూసుకోవాలని సూచించారు. ఇలాంటి అవగాహన సదస్సులు రైతులకు ఎంతో దోహదపడతాయని కృష్ణయ్య అన్నారు. గంగవరం వచ్చిన శాస్త్రవేత్తల బృందానికి రైతు సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. సభకు బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు తలపనేని రామారావు అధ్యక్షత వహించారు. సదస్సులో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అజరు కుమార్, పర్చూరు ఉద్యాన శాఖ అధికారి రవి ప్రకాష్, రైతు సంఘం నాయకులు కందిమళ్ల రామకోటేశ్వరరావు, డాక్టర్ మంచాల రమేష్, బాచిన కోటేశ్వరరావు, వెంకట్రావు పాల్గొన్నారు.










