బాలల సంఘం జిల్లా వర్క్‌షాప్‌లో వక్తలు
ప్రజాశక్తి - ఏలూరు
బాల బాలి కలకు శాస్త్రీయ విద్యాబోధన ఎంతైనా అవసరమని పలువురు వక్తలు అన్నారు. బాలల సంఘం జిల్లా వర్క్‌షాప్ ఆదివారం ఉదయం ఐద్వా జిల్లా కార్యాలయంలో జరిగింది. వర్క్‌షాప్‌లో ఐద్వా జిల్లా కన్వీనర్ హైమావతి మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతుంటే మనదేశంలో విద్యా వ్యవస్థలో మూఢ భావాల వల్ల శాస్త్రీయ విద్యా విధానం అమలు కావడం లేదన్నారు. అటువంటి విద్యా విధానాన్ని ప్రభుత్వాలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల నైపుణ్యాన్ని పెంచాలని, అప్పుడే పిల్లలు మానసికోల్లాసంతో విద్య అభ్యసిస్తారని అన్నారు. పిల్లలకు విద్యతోపాటు వారికి ఇష్టమున్న క్రీడలు, సాంస్కృతిక విషయాల్లో ప్రోత్సాహం ఇస్తే వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందన్నారు. బాలల సంఘం నాయకులు కె.రాకేష్ మాట్లాడుతూ దేశంలో విద్యా విధానంలో కేరళ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇటీవల కేరళలో జరిగిన ఆలిండియా బాలల సంఘం వర్క్‌షాప్ వివరాలు ఆయన తెలిపారు. కేరళలో బాల్య దశ నుండే జెండర్ ఈక్వాలిటీని నేర్పిస్తున్నారని, దేశంలోని పౌరులంతా కులమతాలకు అతీతంగా కలిసి ఉండాలనే సామాజిక స్పృహను కలిగిస్తున్నారని అన్నారు. అటువంటి విద్యా బోధన మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరారు. హేలాపురి బాలోత్సవం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ బాలబాలికల్లో దాగివున్న నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం హేలాపురి బాలోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు, కవులు, రచయితల జయంతులు, వర్ధంతులు పాఠశాలల్లో రెగ్యులర్‌గా నిర్వహించడం వల్ల పిల్లల్లో దేశభక్తి నింపుతున్నామని,దాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని అన్నారు. బాలల సంఘం పూర్వపు నాయకులు ఎ.రవి మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ప్రభుత్వం వల్ల ప్రజలు మతోన్మాద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. విద్యా వ్యవస్థలో అశాస్త్రీయమైన జ్యోతిష్యం, మూఢనమ్మకాలను పెట్టిస్తున్నారని, యూనివర్సిటీల్లో మూఢత్వ భావాలు పెంచే వైస్ ఛాన్సలర్లను నియమించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇది భారతదేశంలో రాబోయే తరానికి, యువతకు తీవ్ర నష్టదాయకమని అన్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. సమావేశంలో ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం నాయకులు ఆనంద నాయుడు, జంగిల్ బెల్స్ విద్యాసంస్థల అధినేత సురేష్, ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం ట్యూషన్ సెంటర్ల నిర్వాహకులు గాళ్ల శారద, కస్తూరి, బాలల సంఘం జిల్లా నిర్వాహకులు పి.కిషోర్ తదితరులు మాట్లాడారు. సమావేశానికి ఎస్.ఝాన్సీలక్ష్మి, కె.రాకేష్, హైమావతి అధ్యక్షత వహించారు. వివిధ సంఘాల నాయకులు మహంకాళి, మహాలక్ష్మి రామలక్ష్మి సుకన్య కుమారి, వరలక్ష్మి, నిర్మల. కట్టా సత్యనారాయణ పాల్గొన్నారు. చేతివత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ బి.ఆదిశేషు బాలబాలికలతో గురజాడ రాసిన దేశమును ప్రేమించుమన్నా.. మంచి అన్నది పెంచుమన్నా గీతాలాపన చేశారు.










