Oct 10,2022 23:37

నేదునూరి విగ్రహానికి నివాళులర్పిస్తున్న ప్రముఖులు

- కృష్ణమూర్తికి నివాళులర్పించిన కళారంగ ప్రముఖులు
ప్రజాశక్తి- సిరిపురం
: కర్ణాటక సంగీతంలో ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన శాస్త్రీయ శిఖరం డాక్టర్‌ నేదునూరి కృష్ణమూర్తియని దశాబ్ధిక గ్రంథకర్త కొత్తపల్లి బంగారరాజు అన్నారు. సోమవారం సంగీత కళానిధి నేదునూరి 95వ జయంతి సందర్భంగా ఆర్‌కె బీచ్‌ రోడ్డులోని ఆయన విగ్రహానికి ఘంటసాల స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పౌర గ్రంథాలయాల అభివృద్ధి సంస్థ అధ్యక్షులు పిఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ డాక్టర్‌ నేదునూరి కృష్ణమూర్తి శాస్త్రీయ సంగీత వైభవానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్‌ మాట్లాడుతూ నేదునూరి తన పరిపూర్ణమైన జీవితాన్ని కర్ణాటక సంగీతం కోసం అంకితం చేశారన్నారు. ఆయన వద్ద సంగీత శిక్షణ పొందిన శిష్యులు నేడు అత్యున్నత సంగీత కళాకారులుగా రాణిస్తున్నారన్నారు. ఎల్‌ఐసి డిఒ బొమ్మిడి సత్యనారాయణ మాట్లాడుతూ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో నేదునూరి చిరస్మరణీయులుగా నిలిచిపోతారన్నారు. ఘంటసాల స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక కార్యదర్శి చెన్నా తిరుమలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాటక రంగ నిర్వహకులు బొడ్డేటి జగత్‌రావు, స్వర కళానిధి సంగీత సంస్థ అధ్యక్షులు రైల్వే ప్రసాద్‌ పాల్గొన్నారు.