ప్రజాశక్తి - బాపట్ల
సమాజంలో శాస్త్రీయ సమాలోచన పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేయాలని జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా రామారావు కోరారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం జరిగిన జెవివి సమావేశంలో మాట్లాడారు. ఈనెల 22న చీరాల ఎన్జీవో హోంలో జరుగనున్న సైన్స్ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ప్రజల్లో మూఢనమ్మకాలను పారదోలి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి జరగాలని అన్నారు. జన విజ్ఞానం పేరుతో ఒక సైన్స్ పత్రికను రాష్ట్ర స్థాయిలో ఆన్లైన్ పత్రికగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. చెకుముకి జిల్లా సంబరాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సీనియర్ నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలల్లోని సైన్స్ ఉపాధ్యాయులను జెవివి బాధ్యతల్లోకి తీసుకుని చెకుముకి పరీక్షను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లా సాంస్కృతిక కన్వీనర్ దక్షిణామూర్తి మాట్లాడుతూ 10మంది కళాకారులతో టీంను ఏర్పాటుచేసి పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు శాస్త్రీయ ఆలోచనలపై అవగాహన కల్పించాలన్నారు. సీనియర్ నాయకులు ప్రసాదరావు మాట్లాడుతూ అధికారుల ద్వారా సైంటిఫిక్ టెంపర్ డేను ప్రతి పాఠశాలలో జరిగే విధంగా కృషి చేయాలన్నారు. కోట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఊరూరా జనవిజ్ఞానం పేరుతో సమాజ చైతన్యానికి కృషి చేస్తున్నామన్నారు. ఆకాశంలో సగం - అవనిలో సగం పేరుతో మహిళల పట్ల మరింత గౌరవాన్ని పెంచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. సమావేశానికి బాపట్ల జిల్లా అధ్యక్షులు యాజలి భాస్కరరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతికి సంతాపం ప్రకటించారు. జెవివి నాయకులు కుర్రా శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి తంగా శ్రీనివాసరావు, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు, యూటీఎఫ్ పట్టణ నాయకులు రాజేష్ పాల్గొన్నారు.