నలభై ఏళ్ల క్రితం ఒక మాసపత్రికలో ఓ కథ చదివాను. రచయిత పేరు గుర్తులేదు. ఓ గురువుగారు ఒక సమాధిపై ఆశ్రమం కట్టి దాని మహిమల గురించి ప్రచారం చేస్తాడు. ప్రజలు ఆ సమాధి దర్శనం కోసం వేలాదిగా వచ్చి, కానుకలు సమర్పిస్తారు. ఆ కానుకలతో ఆ గురువుగారు గొప్ప ధనవంతుడవుతాడు. అంతవరకూ ఆయన దగ్గర సేవలు చేస్తూ ఉండిన శిష్యుడు, వేరుగా వెళ్తానని కోరతాడు. గురువు అతనికి కొంత ధనం ఇచ్చి, ఇబ్బంది పడకూడదని ప్రయాణానికి తోడుగా ఓ గాడిదను ఇచ్చి పంపిస్తాడు. శిష్యుడు ధనం ఖర్చు చేస్తూ జల్సాగా గాడిదపై తిరుగుతూండగా...ఓ రోజు ఆ గాడిద చచ్చిపోయింది. అంతే! శిష్యుడి బుర్రలో ఫ్లాష్ వెలిగింది. ఓ గుంత తవ్వి ఆ గాడిదను పూడ్చి, సమాధి కట్టి, 'ఇది ఒక గొప్ప మహనీయుడి సమాధి. అందరి కోరికలు తీర్చే సమాధి' అని ప్రచారం చేస్తాడు. ఎప్పుడూ కొత్తదనం కోరుకునే భక్తులు తండోపతండాలుగా రావడం మొదలవుతుంది. శిష్యుడి ఆదాయం పెరుగుతుంది. ఆ సమాధి చుట్టూ గుడి కట్టి, బంగారు తాపడం చేసి ప్రారంభోత్సవానికి తన గురువు గారిని ఆహ్వానిస్తాడు శిష్యుడు. కార్యక్రమం ముగిసిన రాత్రి ఏకాంతంలో సురాపానం చేస్తూ 'గురువా! మీరు ఎవరో మహానుభావుడి సమాధిని చూపించి సంపాదిస్తున్నారు. నేను చూడండి...ఓ గాడిద సమాధి చూపించి, ప్రజల్ని బోల్తా కొట్టించి ఎంత సంపాదిస్తున్నానో..!'' అన్నాడు శిష్యుడు కూసింత గర్వంగా. అందుకు గురువుగారు పెద్దగా నవ్వుతూ ''ఓరి పిచ్చివాడా...నేను అంత అమాయకుణ్ణి అనుకున్నావా. అక్కడ ఉన్న సమాధి ఎవరిదో తెలుసా? హా..హా...ఈ గాడిదను కన్న అమ్మదేరా!'' అని ముక్తాయించాడు.
నలభై సంవత్సరాల తర్వాత కూడా పరిస్థితులలో ఏ మాత్రం మార్పు లేదు. సరికదా ఇంకా దిగజారిపోతున్నాయి. ప్రజల్లో మూఢనమ్మకాలు ప్రబలడానికి తమ వంతు కృషిగా అన్ని మతాల గురువులు, ప్రబోధకులు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు.
జన్మ, పునర్జన్మ, మరణం తరువాత సౌఖ్యాలు, గత జన్మ పాపాలు, వాటి ప్రక్షాళన గురించి, రాబోయే జన్మలో మెరుగైన పుట్టుక, జన్మ రాహిత్యంతో మోక్షం గురించి...వివిధ మాధ్యమాల ద్వారా ప్రతి రోజు అన్ని మతాలకు చెందిన అనేక మంది గురువులు, ప్రబోధకులు ఊదరగొడుతున్నారు. ఇదంతా మెల్లమెల్లగా స్లో పాయిజన్ లాగా ప్రజల మెదడులోకి ఎక్కుతోంది. రంగు రాళ్లు, పేరులో అక్షరాల మార్పుల గురించి, తాయత్తులు, హస్త రేఖలు, పవిత్ర తీర్థం గురించి...ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా, వ్యాపార ప్రకటనల ద్వారా, ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా అనేక మూఢ నమ్మకాలను పుంఖానుపుంఖాలుగా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు.
లాజిక్ లోపించినప్పుడు భక్తి మూఢభక్తి అవుతుంది. చనిపోయిన తర్వాత మనిషి బతకడం అన్నది ఎక్కడా నిరూపితం కాలేదు. అది ఒక పెద్ద మూఢ నమ్మకం. ఈ మూఢ నమ్మకాలకు, మూడవ భక్తికి పరాకాష్ట.. మదనపల్లిలో జరిగిన జంట హత్యలు. ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు ఇద్దరూ కలసి తమ విద్యావంతులైన ఇద్దరు కూతుళ్లను భక్తి పేరుతో పాశవికంగా చంపడం హేయమైన, అమానుషమైన సంఘటన. అయితే ఇందుకు దారితీసిన పరిస్థితులు ఏ ఒక్క రోజులోనో ఏర్పడినవి కావు. ఈ సంఘటనపై జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మదనపల్లిలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో వెల్లడైన అభిప్రాయాల ప్రకారం వారి తల్లిదండ్రులు మూడు రకాలుగా ఈ మూఢ భక్తికి లోనయ్యారు. ఒకటి-మూఢనమ్మకాలు ప్రేరేపించి దుశ్చర్యల వైపుగా కార్యోన్ముఖులను చేసే సాహిత్యాన్ని విపరీతంగా చదవడం. రెండు-కొంతమంది (మాంత్రికులు, తాంత్రికులు, క్షుద్ర శక్తుల ఉపాసకులు) ఈ క్షుద్ర చర్యలను ప్రోత్సహిస్తూ, అందుకు సలహాలు సహాయం అందిస్తూ ప్రత్యక్షంగా వారిని ఉసిగొల్పడం. మూడు-నిరంతరం అనేక మాధ్యమాల ద్వారా...అంటే టీవీ, వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా వచ్చే అసత్య ప్రచారాలు, మూఢనమ్మకాల ప్రభావం పడడం.
ఈ కారణాల వల్ల విచక్షణ కోల్పోయి మూఢ భక్తి ముసుగులో జరిగిన ఈ జంట హత్యల వల్ల భారతదేశం ఉలిక్కిపడింది. ఉన్నత విద్యావంతులు, తల్లిదండ్రులు తమ విచక్షణను కోల్పోయి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అంటే మన చదువులు నిజమైన విజ్ఞానాన్ని అందించడం లేదా? చదువు అన్నది జీవనభృతి కోసం మాత్రమేనా? అందులోనూ ఇద్దరూ సైన్స్ చదివిన విద్యావంతులు. సైన్స్ పాఠాలు వల్లె వేసి, బట్టీ పట్టి, రాసి మార్కులు తెచ్చుకోవడంతో సైన్స్ పని అయిపోయిందా? ఉద్యోగం తెచ్చుకుని జీతం కోసం సైన్స్ పాఠాలు చెప్పేస్తే సైన్స్ పని అయిపోయిందా? సైన్స్‌ను అవగాహన చేసుకుని సైన్స్‌ను ఆచరించడం లేదా? ఈ పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మూఢనమ్మకాల మత్తులో ఉన్నత చదువులు తెల్లబోయిన వేళ...మన చదువులు నిజమైన విజ్ఞానాన్ని అందించడం లేదా అన్న సందేహం కలుగుతోంది.
అంతరిక్ష ప్రయోగం కోసం రాకెట్ నమూనాని దేవుడి పటం దగ్గర పెట్టి పూజలు చేయడం, రాకెట్ ప్రయోగం ముందు గ్రామదేవతకు జంతుబలులు ఇవ్వడం...లాంటివి గమనిస్తే ఏమనిపిస్తుంది? శాస్త్రవేత్తలకే శాస్త్రీయ అవగాహన లేదని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదనిపిస్తుంది.
నిజమైన సైన్స్ పాఠాల ద్వారా శాస్త్రీయ అవగాహన పెంపొందాలి. శాస్త్రీయ దృక్పథం అంటే శాస్త్రీయ ఆలోచన అలవడాలి. ప్రతి తరగతి లోనూ శాస్త్రీయ దృక్పథాన్ని విధిగా పాఠ్యాంశంగా చేస్తే బాగుంటుంది.
నెహ్రూ తన 'డిస్కవరీ ఆఫ్ ఇండియా' (పేజి-452)లో ఇలా పేర్కొన్నారు. ''ఈనాడు అనేక మంది శాస్త్రవేత్తలు తమ విధులు దాటి బయటకు వస్తే, సైన్స్‌ను పూర్తిగా మర్చిపోతున్నారు. శాస్త్రీయ దృక్పథం అన్నది జీవితంలో ఒక భాగం కావాలి. అదే జీవితం కావాలి. తోటి వారితో మన ప్రవర్తన, ఆలోచన, చేరిక శాస్త్రీయంగా ఉండాలి. ఇలా మన వంతు ప్రయత్నిస్తే ఎంతో కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది. మన మీదున్న మతం, వేదాంతాల ప్రభావం కొంతైనా తగ్గే అవకాశం ఉంది. సైంటిఫిక్ టెంపర్ మనిషి తప్పక ప్రయాణం చేయవలసిన మార్గం.''
స్వాతంత్య్రం వచ్చి 75వ సంవత్సరంలోకి అడుగెట్టిన ఈ సందర్భంలో కూడా అశాస్త్రీయత గురించి మూఢనమ్మకాల గురించి మాట్లాడుకోవడం అత్యంత శోచనీయం. అంధ విశ్వాసాలను పారదోలేందుకు సైన్స్ సంఘాలు నిర్విరామంగా కృషి చేయాల్సి వస్తోంది. సైన్స్ ఆవిష్కరణలను వాడుకుంటూ సైన్సుకు వ్యతిరేకమైన, అశాస్త్రీయ భావాల ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాలు ఆపాలన్నా... నిజమైన సైన్సు బోధన జరగాలన్నా...ఒక్కటే మార్గం. మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం తీసుకు రావాలి.
మూఢనమ్మకాల పేరుతో ప్రజలను మోసం చేసేవారిని కట్టడి చేసేందుకు నిరంతరం శ్రమించిన నరేంద్ర దబోల్కర్ హత్యానంతరం మహారాష్ట్రలో మూఢనమ్మకాల చట్టం వచ్చింది. కర్ణాటకలో కూడా మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం అమలులో ఉంది. ఇటీవలే మహారాష్ట్రలో రంగు రాళ్లు, ఇతర అశాస్త్రీయ ప్రకటనలు టీవీలో రాకుండా చట్టం చేసింది అక్కడి ప్రభుత్వం.
ఈ సమయంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని అనేక ప్రజా సంఘాలు, సైన్సు ప్రేమికులు కోరుకుంటున్నారు. చట్టసభలలో క్రియాశీలకంగా పని చేసే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతో అన్ని సంఘాలు కలిసి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ చట్టం సాధనకు కృషి చేయాలి. మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం వెంటనే తీసుకురావాలి. శాస్త్రీయ సమాజానికి శ్రీకారం చుట్టాలి.
యం.యస్. యుగంధర్
(వ్యాసకర్త జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు)










