
* జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్
* సైంటిఫిక్ టెంపర్ క్యాంపెయిన్ ప్రారంభం
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: సమాజాభివృద్ధికి ప్రతిఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ పిలుపునిచ్చారు. నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రముఖ శాస్త్రవేత్తలు సర్ సి.వి రామన్, మేరీ క్యూరీ జయంతిని పురస్కరించుకుని ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన శాస్త్ర ప్రచార ఉద్యమంలో భాగంగా సైంటిఫిక్ టెంపర్ క్యాంపెయిన్‌ను మంగళవారం ప్రారంభించారు. ముందుగా సి.వి రామన్, మేరీ క్యూరీ చిత్రపటాలకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె.సూర్యచంద్రరావు, వైస్ ప్రిన్సిపాల్ పి.శంకరనారాయణతో కలసి పూలమాలలు నివాళ్లర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ సైంటిఫిక్ టెంపర్ క్యాంపెయిన్‌ను ఈనెల ఏడో తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాలతో పాటు పట్టణాలు, గ్రామాల్లోని ఉన్నత విద్యాలయాలు, ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బిడిఎస్, యూనివర్సిటీ, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, ఇతర ఉన్నత పాఠశాలలో చెకుముకి సైన్సు సంబరాలు, సైన్స్ ఫెస్టులు, ప్రయోగాలు, సైన్స్ ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మ్యాజిక్ షోలు, పోస్టర్ ఎగ్జిబిషన్లు, పెయింటింగ్ పోటీలు, షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్లు, కరపత్రాల పంపిణీ, ర్యాలీలు, సెమినార్‌లు, సమావేశాల ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. విద్యావంతులు, మేధావులు, అధ్యాపకులు, వైద్యులు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. జెవివి నాయకులు సిహెచ్.ఉమామహేశ్వర్ అశాస్త్రీయ భావనలను పోగొట్టే మ్యాజిక్ షో నిర్వహించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా సీనియర్ నాయకులు కొత్తకోట అప్పారావు, జిల్లా అధ్యక్షులు కుప్పిలి కామేశ్వరరావు, కళాశాల ఫిజిక్స్, కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జీలు టి.స్వర్ణలత, పి.సూర్య సునీత, జెవివి జిల్లా నాయకులు ఎం.వాగ్దేవి, పి.కూర్మారావు, వి.ఎస్ కుమార్, గరిమెళ్ల అధ్యయన కేంద్రం కన్వీనర్ వి.జి.కె మూర్తి, అధ్యాపకులు పద్మావతి, సిహెచ్.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.