Nov 09,2023 00:33

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : ఆలిండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ అనుబంధ సంస్థలైన జనవిజ్ఞాన వేదిక, ఇతర రాష్ట్రాల్లోని 40 సైన్స్‌ సంస్థలు ప్రముఖ శాస్త్రవేత్తలు సివి రామన్‌, మేరీక్యూరీ జయంతి రోజు నవంబర్‌ 7 నుండి జాతీయ సైన్స్‌ దినోత్సవం ఫిబ్రవరి 28 వరకూ శాస్త్రీయ దృక్పథ ప్రచారం నిర్వహిస్తున్నట్లు జెవివి జిల్లా గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించి పోస్టర్‌ను స్థానిక బ్రాడీపేటలోని యుటిఎఫ్‌ కార్యాలయంలో కెఎస్‌ లక్ష్మణరావు, జెవివి నాయకులు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ మూఢవిశ్వాసం, సుడోసైన్స్‌ నిరోధించటం కోసం శాస్త్రీయ ధృక్పథంపై గ్రామాల్లో, పట్టణాల్లో, పాఠశాలల్లో, కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కళాజాతాలు, సైన్స్‌ ప్రయోగాలు, మ్యాజిక్‌షోలు, స్లైడ్‌లు, పోస్టర్ల ప్రదర్శన, సోషల్‌ మీడియా వంటి వివిధ రూపాల ద్వారా ఈ ప్రచారం కొనసాగుతుందని తెలిపారు. ఆర్టికల్‌ 51ఎ(హెచ్‌) ప్రకారం పౌరులందరూ శాస్త్రీయ ధృక్పథం కలిగి ఉండాలన్నారు. రాష్ట్ర మాజీ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎన్‌.వేణుగోపాలరావు మాట్లాడుతూ సైన్స్‌ ఫర్‌ డెమోక్రసీ, సైన్స్‌ ఫర్‌ సెక్యులరిజం పేరుతో ప్రచారం జరుగుతుందన్నారు. జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని సృజనాత్మక శక్తిని పెంపొందింప చేయటమేనని సైంటిఫిక్‌ టెంపర్‌ క్యాంపెయిన్‌ ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఎం.కళాధర్‌, బి.ఆదిలక్ష్మి, ఎమ్‌డి.షకీలాబేగం, జి.వెంకటరావు, ఎస్‌.ఎం.సుభాని, ఎస్‌డి.గయాసుద్దౌలా పాల్గొన్నారు.