Feb 27,2023 21:31

ప్రజాశక్తి - మండవల్లి
               విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్రీయ అంశాలను వెలికి తీయడానికి సైన్స్‌ ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని డిప్యూటీ తహశీల్దార్‌ ఎం.సుధారాణి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సుధామ ఫౌండేషన్‌ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి విద్య వైజ్ఞానిక సైన్స్‌ ప్రదర్శనలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సైన్స్‌పై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం అన్నారు. తద్వారా విద్యార్థులు రానున్న కాలంలో ఉత్తమ శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఎంత దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా మండవల్లి, లింగాల, కానుకొల్లు, పుట్లచెరువు, ఎంగిలిపాకలంక, లోకముడి, చింతపండు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఏర్పాటుచేసిన 70 పైగా సైన్స్‌ నమూనాలను తిలకించి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. భావితరాలకు ఉపయోగపడే ప్రాజెక్టు తయారు చేయడంపై ఆమె విద్యార్థులను అభినందించారు. వారికి సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు. సైన్స్‌ ప్రదర్శనలను శాస్త్రవేత్త సుధామ ఫౌండేషన్‌ అధినేత సుధాబత్తుల విజయకుమార్‌ ప్రారంభించగా ఆయనతో పాటు జూనియర్‌ లెక్చరర్‌ కిరణ్‌కుమార్‌, రిటైర్‌ ఉపాధ్యాయులు కె.సూర్యరావు పలువురు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి మెండ ఝాన్సీ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ఎల్‌ఎస్‌.భాస్కరరావు, అప్పారావు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జి.వెంకటేశ్వర్లు, కె.కృష్ణమోహన్‌, ఇండియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ బొంతు దుర్గారావు, ఉపాధ్యాయులు ఆర్‌విఎల్‌.నరసింహరావు, కె.శ్యాంప్రసాద్‌ ,నాగేశ్వరావు, జి.సుబ్బారావు, నాంచారయ్య, కె.రఘురాం, వెంకటేశ్వర్లు, ఎస్‌.రాధ పాల్గొన్నారు.