ప్రజాశక్తి - పంగులూరు
శాస్త్రీయ ఆలోచనతో కూడిన చదువు నేర్చుకుంటే విద్యార్థులు ఏ రంగంలో అడుగుపెట్టిన తిరుగులేని విజయం సాధిస్తారని బూదవాడ జెడ్‌పి ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కాల్వ సోమశేఖర్ అన్నారు. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఆయన "ప్రజాశక్తి"తో మాట్లాడారు. విద్యార్థులకు శాస్త్రీయమైన ఆలోచనలను రేకెత్తించే విధంగా బోధించడం వల్ల తమ విద్యార్థులు అనేక పోటీ పరీక్షల్లో బహుమతులు సాధించారని అన్నారు. అవార్డుల కోసమే కాకుండా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యాబోధన చేస్తున్నట్లు చెప్పారు. పర్చూరు మండలం ఉప్పుటూరుకు చెందిన తాను 1995లో సెకండ్ గ్రేట్ టీచరుగా బల్లికురవ మండలం వైదన గ్రామంలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. పర్చూరు మండలం అడుసుమల్లిలో భౌతిక శాస్త్ర స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి పొందారు. చెరుకూరులో పనిచేశారు. 2017నుండి బూదవాడ జెడ్‌పి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. తన సబ్జెక్టులో 95శాతం విద్యార్ధులు ప్రతి ఏటా ఉత్తీర్ణత సాధిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది నూటికి నూరు మార్కులు సాధించారని, జిల్లా స్థాయి ఇఇ టాలెంట్ టెస్ట్‌లో తమ విద్యార్దులు అవార్డులు సాధించారని తెలిపారు. జెవివి చెకుముకి పరీక్షల్లోనూ తమ విద్యార్ధులు బహుమతులు పొందారని తెలిపారు. ఆయన సేవలను యుటిఎఫ్ నాయకులు అభినందించారు.










