Oct 09,2023 00:50

ముగింపు సభలో మాట్లాడుతున్న డాక్టర్‌ శ్రీనివాసరావు

ప్రజాశక్తి -తగరపువలస : శాస్త్ర విజ్ఞానం నిత్య జీవితంలో భాగమేనని డిఆర్‌డిఒ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు తెలిపారు. షార్‌ - ఇస్రో, రఘు విద్యాసంస్థలు సంయుక్తంగా భీమిలి మండలం రఘు ఇంజనీరింగ్‌ కళాశాల వేదికగా ఇటీవల ప్రారంభమైన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ, శాటిలైట్‌ టెక్నాలజీ నేడు మానవ జీవన ప్రయాణాన్ని మార్చేసిందన్నారు. శాస్త్ర విజ్ఞానం నిత్య జీవితంతో ముడిపడి ఉందని నొక్కి చెప్పారు. స్టార్టప్‌ రంగంలో యువత రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్టార్టప్‌ ఇండియాతో భారత ప్రభుత్వం యువతను
ఆవిష్కర్తలుగా, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దు తున్నట్లు పేర్కొన్నారు. టెలిఫోన్‌లో వచ్చిన అనేక మార్పులకు కారణమైన శాటిలైట్‌ విజ్ఞాన ఉపయోగాలను వివరించారు
ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో పాల్గొన్న విద్యార్థుల ప్రతిభ, వారి సృజనాత్మకత ఎంతో అద్భుతంగా ఉందని షార్‌ శాస్త్ర వేత్త, విశాఖ రీజియన్‌ కార్యక్రమ నిర్వహణ సబ్‌ కమిటీ చైర్మన్‌ జి.అప్పన్న అన్నారు. కొన్ని సందర్భాలలో విద్యార్థుల ఆలోచనలు మమ్మల్ని ఒకింత ఆలోచింప జేసేవిగా ఉన్నాయని తెలిపారు. ఈ తరహ వారోత్సవాలను ఎపితో పాటు ఒడిశా, తమిళనాడు లోని పలు ప్రాంతాల్లో నిర్వహించామని చెప్పారు.
యువత నుంచి ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందని రఘు విద్యా సంస్థల చైర్మన్‌ కలిదిండి రఘు అన్నారు. కార్యక్రమంలో భాగమైన షార్‌ శాస్త్ర వేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. షార్‌ ఎస్‌ఒఎస్‌ఇ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ పి వెంకటరెడ్డి మాట్లాడుతూ, అంతరిక్షంలో అపూర్వ విజయాలు ఇటీవల కాలంలో భారత్‌ సొంతం చేసుకుందన్నారు. చంద్రయాన్‌, ఆదిత్య ప్రయోగ విజయాలు భారత్‌ అంతరిక్ష పరిశోధన శక్తిని చాటాయని చెప్పారు. దేశ యువతలో అంతరిక్ష విజ్ఞానం పట్ల ఆశక్తి, ఉత్సుకత పెరుగుతున్నాయన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన రఘు ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. షార్‌ తరపున రఘు విద్యా సంస్థల చైర్మన్‌ కలిదిండి రఘుకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో షార్‌ ప్రతినిధి హరికృష్ణ, ఎన్‌ఎస్‌టిఎల్‌ శాస్త్రవేత్త ఆర్‌విఎస్‌ సుబ్రహ్మణ్యం, శ్రీధర్‌, షార్‌ శాస్త్రవేత్తలు, రఘు ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అంతరిక్ష విజ్ఞాన, వైజ్ఞానిక ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది.
భారత అంతరిక్ష పితా మహులు విక్రమ్‌ సారా భారు చేసిన కృషి, రాకెట్ల తయారీ, స్పేస్‌ మిషన్‌, లిక్విడ్‌ స్టేజెస్‌ ఆఫ్‌ రాకెట్స్‌, లూనార్‌ వెహికల్స్‌, శాటిలైట్‌లు పని చేసే విధానం, భారతీయ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ల పని తీరు, ప్రజలకు ఉపయుక్తంగా శాటిలైట్‌లు నిలుస్తున్న పద్ధతులను ప్రదర్శన ద్వారా వివరించారు. ప్రదర్శించిన శాటిలైట్‌లు, రాకెట్ల నమూనాలు విద్యార్థులకు ఎంతో ఆసక్తిని కలిగించాయి. రఘు ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థిని శాస్త్రీయ నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది.