Aug 30,2023 00:26

పట్టాలను ప్రదానం చేస్తున్న వర్సిటీ ఛాన్సలర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

ప్రజాశక్తి - ఎఎన్‌యు : శాస్త్ర, సాంకేతిక రంగాలే విజ్ఞానానికి మూల స్తంభాలని, వీటిల్లో ఫలితాలే ప్రపంచ సవాళ్లను అధిగమించి పర్యావరణ సుస్థిరతను, నైతికతను, మానవతకు బలాన్ని చేకూరుస్తాయని రాష్ట్ర గవర్నర్‌, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఛాన్సలర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. వర్సిటీ 39వ, 40వ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఛాన్సలర్‌ మాట్లాడుతూ దేశ భవిష్యత్‌ యువతేనని, వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకెళ్లాలని అన్నారు. 2035 నాటికి ఉన్నత విద్యలో 50 శాతం పెరుగుదల లక్ష్యంగా నూతన విద్యావిధానం కలిగి ఉందన్నారు. కృత్రిమ మేథ ఆధునిక ప్రపంచానికి వరమని చెప్పారు. జ్ఞాన సముపార్జనను వ్యక్తిగత సాధనగా భావించరాదని, మానవాళిని వృద్ధిలోకి తెచ్చే మార్గమని అన్నారు. ఆత్మనిర్బరభారత్‌, స్టార్టప్‌ ఇండియా అనేవి యువతకు కాంతి కిరణాలని, ప్రపంచంలోనే అత్యధిక స్టార్టప్‌ కేంద్రాలతో ఇండియా విలసిల్లుతోందని చెప్పారు. ఆరోగ్యం, పర్యావరనాన్ని మెరుగుపర్చేలా విద్యార్థులు తయారవ్వాలని, కమ్యూనిటీల సాధికారత, పరిశ్రమలను మెరుగుపరచడానికి పని చేయాలని సూచించారు. మనిషి గౌరవాన్ని, గోప్యతను కాపాడేందుకు కృషి చేయాలని చెప్పారు.
గౌరవ డాక్టరేట్‌ గ్రహీత, రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభం తలెత్తినప్పుడు ఆ సంక్షోభం నుండి గట్టెక్కడానికి దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చర్యలు చేపట్టిందని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అప్పటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం చొరవ తీసుకొని జయతీ ఘోష్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి, వ్యవసాయ సంక్షోభాన్ని గట్టెక్కడానికి దేశంలోనే రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గొప్ప భాష వారసత్వ చరిత్ర కలిగిందన్నారు. తాను గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా అధ్యయనం చేయడం వలన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, జర్నలిజం మొత్తం వ్యవసాయ రంగం గ్రామీణ పరిస్థితుల గురించి అధ్యయనం చేయడం జరుగుతూ వచ్చింది చెప్పారు.
తొలుత వర్సిటీకి చాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. ఆయనకు వీసీ పి.రాజశేఖర్‌ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వర్సిటీ ప్రగతిని వీసీ వివరించారు. అనంతరం పాలగుమ్మి సాయినాథ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. అనంతరం 30 మందికి పైగా విద్యార్థులు ఛాన్సలర్‌ నుండి పిహెచ్‌డిలు, బంగారు పతకాలు, బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ వరప్రసాద్‌మూర్తి, రిజిస్ట్రార్‌ బి.కరుణ, వివిధ విభాగాల అధిపతులు, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌, అకడమిక్‌ సెనేట్‌ సభ్యులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.