ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నమోదులో భాగంగా స్థానిక కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం మంగళవారం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా విద్యాశాఖ అధికారి కె.శామ్యూల్ మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరంలో ఏపీ ఓపెన్ స్కూల్ కోర్సులలో ప్రవేశం పొందే అభ్యాసకులు ఏపీ ఆన్‌లైన్ ద్వారా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశ దరఖాస్తు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యాసకులు ప్రవేశ నమోదుకు సంబంధించిన సమాచారం కొరకు www.apopenschool.apgov.in నందు సందర్శించాలన్నారు. ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌ను గుర్తించి ఉన్నత పాఠశాలలో జూనియర్ కళాశాలలో సెలవు రోజులలో అభ్యాసకులకు 30 ముఖాముఖి తరగతులు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం తరగతులు నిర్వహించబడతాయన్నారు. ప్రాక్టికల్స్‌కు అదనంగా మరో 20 రోజులు ఇంటర్మీడియట్ తరగతులు ఉంటాయని చెప్పారు. అక్టోబర్ మొదటివారం నుండి స్టడీ సెంటర్ నుండి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. స్టేట్ కో-ఆర్డినేటర్ ఎన్.అక్బర్‌అలీ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 31, గవర్నమెంట్ కళాశాలలో 9, ప్రైవేట్ కళాశాలలో 15 గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్లు, ఎ1 సెంటర్లు జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో నిర్వహిస్తామన్నారు. అపరాధ రుసుం లేకుండా ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా అభ్యాసకులు 5 ఏళ్లలో 9 సార్లు పరీక్ష రాసే అవకాశం కల్పించామన్నారు. ఇంటర్ పరీక్షలు రాసే అభ్యర్థులు 10 తరగతి ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. ఒకేడాది వ్యవధి ఉంటే 5 సబ్జెక్టులు ఒకేసారి రాసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఒక ఏడాది వ్యవధి లేకపోతే 4 సబ్జెక్టులు రాసుకునే అవకాశం ఉంటుందని, 2వ ఏడాది మిగిలిన ఒక సబ్జెక్టు రాసుకోవచ్చని , 5 ఏళ్లలో ఉత్తీర్ణత కాకపోతే తిరిగి కొత్తగా అడ్మిషన్ పొందవలసి ఉంటుందని వివరించారు. ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ వివిధ కారణాలతో చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ మంచి అవకాశమన్నారు. ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ రెగ్యులర్ విద్యా సర్టిఫికెట్‌తో సమానమని చెప్పారు. జిల్లా అధికారులంతా వారి వారి పరిధిలో అభ్యాసకులను గుర్తించి ఎస్‌ఎస్సి ఇంటర్ తప్పిన విద్యార్థులను వెంటనే ఏపీ ఓపెన్ స్కూల్‌లో మీ పరిధిలోగల ఏ1 సెంటర్‌లో చేర్పించాలని ఆదేశించారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు స్వచ్ఛంద విద్యాసంస్థల ప్రతినిధులు చొరవ తీసుకొని విద్యార్థులు ప్రవేశాలు పొందేలా చూడాలన్నారు.










