
'జానపద గీతిక జాతి వైతాళిక' అన్నారు శ్రీశ్రీ. మానవునికి ఎంత చరిత్ర ఉందో జానపదాల కూ అంతే చరిత్ర ఉంది. జానపదమనగా పల్లె. పల్లె ప్రజల మధ్యన స్వతఃసిద్ధంగా పుట్టిన కళలు, పాటలే.. జానపద కళలు, జానపదాలు సాహిత్యంగా రూపుదిద్దుకున్నాయి. ఇంగ్లీషులో వీటికి 'ఫోక్‌లోర్' అని, హిందీలో 'లోక్‌గీత్', 'లోక్ సంస్కృతి' అంటారు. మనిషి ముందుగా జానపదుడు. ఆ తరువాతనే నాగరికుడుగా మారాడు. ప్రజల మాటలు, ఆటలు, పాటలు, కథలు, సామెతలు, నుడికారాలు, జానపద విజ్ఞానముగా రూపుదిద్దుకున్నాయి. ఇవి అలిఖిత, మౌఖిక సాహిత్యం.
'ఆ గట్టునుంటావా మల్లన్న.. ఈ గట్టునుంటావా..?' అంటూ ఎటుంటావో తేల్చుకోమంటూ హెచ్చరిక చేస్తోంది ఈ జానపదం.. 'గల్లీ సిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది.. వారున్న ఇల్లు కిల్లీకొట్టుకన్న సిన్నగున్నది.. ఇళ్లకన్నా మేలురా.. పలక్‌నామ బళ్లురా..' .. అంటూ పేదోళ్ల ఇంటిని వర్ణించిన తీరు వారి పేదరికాన్ని చాటుతుంది ఈ జానపదం. 'ఎందుకే నీకింత తొందరా.. ఇన్నాళ్ల చెరసాల ఈ రేయి తీరునే.. ఓ చిలుక.. నా చిలుకా.. ఓ రామచిలుకా.. వయ్యారి చిలుకా.. రాగాల మొలకా.. బాధలన్నీ.. పాత గాథలైపోవునే.. చింతలన్నీ వెలుగు పుంతలో మాయునో.. ఎలాగో ఓలాగూ. ఈ రేయి దాటినా..' అంటూ ప్రియుని కోసం ఎదురుచూస్తున్న ప్రియురాలు చిలుకతో చెప్తున్న జానపదం.. 'మల్లేశ్వరి' చిత్రంలో కృష్ణశాస్త్రి కలం నుండి జాలువారిన జానపదం పాటలన్నీ పెద్ద హిట్. యాభై ఏళ్లు పైబడినా ఆ పాటలు నేటి తరమూ పాడుతున్నారంటే.. అవన్నీ ప్రజల మదిని తాకే అక్షర గీతికలు.
దేశ విదేశాల్లో..

జానపద కళలు, విజ్ఞానం ప్రపంచమంతటా ఉన్నాయి. అమెరికా, ఆఫ్రికా, చైనా, చిలీ, భారతదేశం వంటి అనేకదేశాల్లో జానపద కళలు, విజ్ఞానం ఉన్నాయి. అమెరికాలో ఏడాదికి ఒకరోజున పదివేల మంది కళాకారులతో జానపద కళా జాతర జరుగుతుంది. చైనా ప్రథమ పౌరురాలు పెంగ్‌లియాన్ గొప్ప జానపద కళాకారిణి. ఆఫ్రికా దేశాలలో ఈనాటికీ అచ్చమైన ఆదివాసీ నృత్యాలున్నాయి. చిలీ దేశపు జానపద ప్రజా గాయకుడు విక్టర్ జారా తన పాటలతో అమెరికా, యూరప్ దేశాలు పర్యటించి, చిలీ దేశపు జానపద సాహిత్యాన్ని పరిచయం చేసి.. ఒక అసంపూర్ణ గీతంగా చరిత్ర సృష్టించాడు. ఐక్యరాజ్యసమితి ఆగస్టు 22న అంతర్జాతీయ జానపద కళాదినోత్సవంగా ప్రకటించింది. అమెరికాకు చెందిన ప్రజా కళాకారుడు బాబ్ డిలాన్‌కు 2016లో నోబుల్ బహుమతి ప్రకటించారు.
ప్రజాగీతాలే.. మాతృకలు..

అయితే జానపదాలు శాస్త్రీయమైనవి కావని.. అవి కేవలం పామరులకు చెందినవని కొందరి దురభిప్రాయం. కానీ శాస్త్రీయ కళలకు, వాయిద్యాలకు జానపద కళలు, వాయిద్యాలే మూలాధారం. గీతికా రచన చాలా ప్రాచీనకాలం నుండి జరుగుచున్నదని ఊహించవచ్చు. ఏ భాష అయినా ప్రజా గీతాలు ముందు పుట్టాయి. శిష్ట సాహిత్యం నాగరికత అభివృద్ధి చెందిన తరువాత ప్రభవించింది. మహాభారతంలోని అసంఖ్యాకములైన ఉపాఖ్యానాలకు ప్రజా గీతాలే మాతృకలని విమర్శకుల అభిప్రాయం. బసవ పురాణంలో పురాతన భక్తుల గీతాలే తన గ్రంథానికి మూలమైనట్లు పాల్కురికి సోమనాథుడు సూచించాడు. హిమవత్పర్వతం మీద ఎఱుక స్త్రీలు గౌడు గీతములు పాడుతున్నట్లు నన్నెచోడుడు కుమారసంభవంలో వర్ణిస్తాడు. నూతుల నుండి ఏతములు తోడువారు గీతాలు ఆలపించుచున్నట్లు ఆముక్తమాల్యదలో చిత్రించబడింది.
వివిధ రాష్ట్రాలు.. పలు పేర్లు..
ఇక మన దేశం వ్యవసాయక దేశం కావటం చేత ప్రాచీనకాలం నుండి పల్లెల్లో ఎన్నో జానపద కళలు ఉన్నాయి. బౌద్ధుల కాలం నుండి ఈ కళలు వర్ధిల్లాయి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ, కాళిదాసు నుండి అన్నమయ్య వరకూ జానపద కళలు, పాటలు వర్ధిల్లుతూనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో ఈ కళారూపాలు, సాహిత్యం పిలువబడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో రాసలీల, మహారాష్ట్రలో లావణి, తమాషా, రాజస్థాన్‌లో ఘుమర్, కాళబేలి నృత్యం, పశ్చిమబెంగాల్‌లో కీర్తన, కీర్తనం, గంభేర, మచలీ నృత్యం, బీహార్‌లో భోజ్‌పురి జానపద గేయాలు, అసోంలో బిహు, పంజాబ్‌లో భాంగ్రా, గుజరాత్‌లో దాండియా, కేరళలో కలియట్టం, మోహిని అట్టం, కర్ణాటకలో యక్షగానాలు, తమిళనాడులో కరఘట్టం (గరగలు) ప్రసిద్ధిగాంచాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ఒడిశా ఇలా ప్రతి రాష్ట్రంలో ఆదివాసీ జానపద నృత్యాలు కోకొల్లలు. చత్తీస్‌ఘడ్ గిరిజన తెగకు చెందిన నిరక్షరాస్యులైన తీజన్‌బాయి, చత్తీస్‌ఘడ్ భాషలో భారతం, రామాయణం, విదేశాల్లో చెప్పి, పేరు ప్రఖ్యాతులు గడించారు. అయితే మనదేశంలో 18వ శతాబ్దం వరకూ జానపద కళలు, సాహిత్యం గురించి పరిశోధనలు జరగలేదు. 1846 నుండి విలియం జోన్స్ వంటి ఆంగ్లేయులు జానపద విజ్ఞానం గురించి కృషి ప్రారంభించారు.
మన రాష్ట్రంలో..
ఇక తెలుగువారు నివసిస్తున్న ఉభయరాష్ట్రాల్లోను, ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారి ప్రాంతాల్లో ఎన్నో జానపద కళలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జానపద సాహిత్యాన్ని వెలుగులోనికి తెచ్చింది కల్నల్ మెకంజీ, జె.ఎ. బోయల్ వంటి ఆంగ్లేయులు. సిపి.బ్రౌన్ జంగమ, దాసర్లును తమ ఇంటికి రప్పించుకుని.. బొబ్బిలి యుద్ధం, కుమార రాముని కథ, కామమ్మ కథ వంటి చారిత్రక ఘట్టాలను సేకరించారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర రెండు వేల సంవత్సరాల నాటిది. ఆనాటి నుండి ఈనాటి వరకూ ఈ కళలు పోషించబడుతూనే ఉన్నాయి. అనాగరిక మానవుడు ప్రకృతిని ఆరాధించడంతో ప్రారంభమైన ఈ కళలు శాతవాహన, చాళుక్య, చోళ, కాకతీయ, పల్లవుల కాలంలోను వర్ధిల్లాయి. హంపి, విజయనగర సామ్రాజ్యంలోనూ, తంజావూరు రాజుల కాలంలోనూ ఈ కళలు వర్ధిల్లి, గోల్కొండ నవాబుల ఆశీస్సులు పొందాయి. ప్రజల మన్ననలు పొంది, జన సంపదగా నిలిచిన ఈ కళలు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రాలలో వివిధ రూపాల్లో విఖ్యాతి గాంచాయి.
వృత్తులు.. కళా రూపాలు..

తోలుబొమ్మలాట, యక్షగానం, చిందు భాగవతం, కురవంజి, హరికథ, బుర్రకథ, వీధినాటకం, ఒగ్గుకథ, తప్పెటగుళ్ళు, గొల్ల సుద్దులు, పగటి వేషాలు, ఆసాదుల నృత్యం, చెక్క భజనలు, జముకుల కథ, బైండ్ల కథలు, కోలాటం, చెంచు పాటలు, గరగల నృత్యం, వీరనాట్యం, భామా కలాపం, డప్పుల నృత్యం, ఉరుములు, పిట్టలదొర, పులి వేషాలు, రుంజ వాయిద్యం, గొరవయ్యలు, కొమ్ముదాసరి, హరిదాసులు, పిచ్చుకగుంట్లు, మందెచ్చులు, బుట్టబొమ్మలు, గంగిరెద్దులాట, బుడిగజంగాలు, శారదకాండ్రు, దాసర్లు, ఎరుకల పాటలు, దేవదాసి నృత్యం, సాముగరిడీలతో పాటు గిరిజన జానపద కళలైన గోండుల గుస్సాడి నృత్యం, కోయ నృత్యం, కొండరెడ్ల మామిడి నృత్యం, ఖోందుల నెమలి నృత్యం, లంబాడి నృత్యం, అరకు ధింసా, సవరల నృత్యాలు వంటి 150కు పైగా జానపద కళారూపాలు ఉన్నాయి. వీటిని పరిశోధకులు భిక్షుక గాయకులు, ఔత్సాహిక గాయకులు, వృత్తి కళాకారులు, ఆశ్రిత కులాలుగాను విభజించారు.
స్త్రీలు పాడుకునే సందర్భాలు..

జానపద సాహిత్యానికి వస్తే.. స్త్రీల సాహిత్యమే ఎక్కువగా ఉంది. ఇది ఒక తరం నుండి ఇంకో తరానికి అందించే మౌఖిక సాహిత్యం. 'జో లాల.... హాయి హాయి, రాయి... రాయి... పిల్లి' అంటూ పాడే అమ్మ జోలపాటతో పాటు ఎన్నో లాలిపాటలు ఉన్నాయి. 'గుడుగుడు గుంచం గుండే రాగం-పాములపట్నం - పటికా బెల్లం' అంటూ పాడుకునే పిల్లల పాటలతో పాటు స్త్రీలు వ్యవసాయ పనుల్లో తమ కష్టాన్ని మర్చిపోడానికి నాట్లు వేసేప్పుడు, కోతలప్పుడు, ఊడ్పుల సమయంలో పాడుకునే పాటలు, చందమామ పాటలుతో పాటు.. తిరగలి (విసుర్రాయి) పాటలు, పెళ్లి సందర్భంలో పాడుకునే సువ్వి పాటలు, అప్పగింతల పాటలు, నలుగు పాటలు, బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో.. అనే బతుకమ్మ పాటలు, గై(గౌ)రమ్మ పాటలు, గొబ్బెమ్మ పాటలు, సంక్రాంతి పాటలు, శ్రామిక గేయాలు, కరుణ, హాస్య, శృంగార పాటలు, తత్త్వాలతోపాటు భారత, రామాయణ, ఇతిహాసాలతో పాటు, 12వ శతబ్దం నాటి కాటమరాజు కథలు, బొబ్బిలి యుద్ధం (1757), సర్వాయి పాపన్న, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అల్లూరి సీతారామరాజు, మియాసాహెబ్ పాటలు, భక్తి గేయాలు, పేరంటాల కథలు వంటి ఎన్నో గేయాలున్నాయి. నండూరివారి ఎంకి పాటలు సరేసరి.
ఉత్తేజాన్ని ఇచ్చేవి.. పోరాటాల పాటలు

ఈ కళలు సినిమాలు, టివిలు రాకముందు నిరక్షరాస్యులైన ప్రజలకు, భారత, రామాయణ, భాగవత పురాణ గాథలతోపాటు వీరగాథలు, చారిత్రక గాథలు వినిపిస్తూ.. విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించాయి. ఫ్రెంచి విప్లవ కాలంలోను, రష్యా విప్లవ కాలంలోను, భక్తి ఉద్యమంలోను, సాంస్కృతిక ఉద్యమంలోను, స్వాతంత్య్ర ఉద్యమకాలంలోను, తెలంగాణ సాయుధ పోరాటంలోను, శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటంలోను ప్రజల బాణీలలో పాటలను కట్టి, ప్రజలను ఉత్తేజం చేశారు. ప్రజానాట్యమండలి, జన నాట్యమండలి వంటి సంస్థలు ప్రజల సమస్యలు విడమర్చి చెప్పాయి. అన్నమయ్య లాలి పాటకు, జోల పాటలకు ఈ జానపదాలే ఎంతో ఆధారం. రవీంద్రుని గీతాంజలి, బంకించంద్ర చటర్జీ వందేమాతర గీతానికి, బిస్మిల్లాఖాన్, ఎ.ఆర్.రెహమాన్, భూపేన్ హజారికా వంటి సంగీత కళాకారులకు జానపదాలే ఆధారమయ్యాయి. సినిమా రంగం కూడా ఎన్నో జానపదాలను పాటలలో చొప్పించాయి.
నిరంతర సాహిత్య ప్రవాహం..

గరిమెళ్ళ 'మాకొద్దీ తెల్లదొరతనం' సుబ్బారావు పాణిగ్రాహి జముకల కథ, వంగపండు ప్రసాదరావు, భూమి బాగోతం, గద్దర్, గోరటి వెంకన్నలు పాడే పాటలకు.. ఈ జానపద బాణీలే ఆధారం. జంగాల కథలను, పద్మశ్రీ షేక్ నాజర్ బుర్రకథలుగాను, యక్షగానాలను హరికథలుగా ఆదిభట్ల నారాయణదాసు, గొల్లసుద్దులను వామపక్షాలు పల్లెసుద్దులుగా మార్చి పాడారు. వీధినాటకాలుగా ఉపయోగించి, ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. 'పల్లెటూరి పిల్లగాడా..... పశులుకాసే వన్నెకాడా..' అనే సుద్దాల హనుమంతు పాడిన పాట, 'బండెనక బండికట్టి.... పదహారుబళ్ళు కట్టి..' అంటూ తెలంగాణ సాయుధ పోరాటంలో పాడిన ఈ పాటలు ఎంతగానో ప్రజలను ఉత్తేజితులను చేశాయి. చిందు బాగోతంలో చిందు ఎల్లమ్మ, ఒగ్గు కథ ప్రవీణ చుక్క సత్తెయ్య, మిద్దే రాములు, పన్నెండు కిన్నెర మెట్లులో బాలయ్య, ధింసాలో కిలో జానకమ్మ బృందాలు ఎంతో పేరు తెచ్చాయి. తెలుగువారి జానపద సాహిత్యాన్ని నంది చలపతిరావు, మంగు వెంకట రంగనాథరావు, టేకుమళ్ళ అచ్యుతరావు, నేదునూరి గంగాధరం, ఎల్లోరా, బిరుదురాజు రామరాజు వంటివారు సేకరించారు. శ్రీహరి ఆదిశేషువు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, వేటూరి ప్రభాకరశాస్త్రి మొదలైనవారు ఎంతో కృషి చేశారు. ఇటీవల కాలంలో ఆర్.వి.యస్. సుందరం, తూమటి దొణప్ప, ఎస్. గంగప్ప, ఆచార్య ఎస్.వి. జోగారావు, తంగిరాల వెంకటసుబ్బారావు, ప్రొ|| జయధీర్ తిరుమలరావు, నాయని కృష్ణకుమారి, భక్తవత్సల రెడ్డి, చిగిచర్ల కృష్ణారెడ్డి, ననుమాస స్వామి, పులికొండ సుబ్బాచారి వంటి మరెంతోమంది జానపద సాహిత్యాన్ని తీసుకురావడానికి కృషి చేస్తూనే ఉన్నారు. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి 'తెలుగువారి జానపద కళారూపాలు' పేరిట సమగ్రమైన పుస్తకాన్ని తీసుకువచ్చారు. సురవరం ప్రతాపరెడ్డి రాసిన 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర'లో తెలుగువారికి సంబంధించిన ఎన్నో జానపద కళలు, పండుగలు, ఆటలు, సంస్కృతి కనిపిస్తాయి. 'రాయలసీమ రాగాలు' పేరుతో మునయ్య ఎన్నో పాటలు సేకరించారు. వింజమూరి సీతాదేవి, అనసూయదేవి గార్లు తెలుగువారి జానపదాలు తమదైన శైలిలో పాడి, విదేశాల్లో పేరు తెచ్చిపెట్టారు. దాలవాయి చలపతిరావు తోలుబొమ్మలాటకు, కనకరాజు గారి గుస్సాడి నృత్యానికి పద్మశ్రీలు రావటం జానపదానికి గౌరవం. వందలాది కళారూపాలతో లక్షల మంది కళాకారులకు, కుటుంబాలకు జీవనభృతిని కల్పించాయి. విశ్వవిద్యాలయాలలోను, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, గిరిజన జానపద కళాపీఠం (వరంగల్) ఎన్నో పరిశోధనలను, ఎన్నో కళారూపాలను తెలుగు సమాజానికి పరిచయం చేశాయి. జానపదం పాతది కాదు, కొత్తది కాదు. అది నిరంతరం ప్రవహిస్తున్న ఒక ప్రవాహం.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జానపద కళారూపాలు ఎన్నో కనుమరుగైపోయాయి. మరెన్నో అవసాన దశలో ఉన్నాయి. వృత్తికళాకారులైన గంగిరెద్దుల వారు, బుడుగ జంగాలు, ఆశ్రిత కులాలు తమ వృత్తులను కోల్పోయి, దీనస్థితిలో ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న ఈ కళలను ప్రజలు, ప్రభుత్వాలు, దేవాదాయ ధర్మాదాయ శాఖలు, సాంస్కృతిక శాఖలు పరిరక్షించాల్సి ఉంది. పాఠ్యాంశాలలో చేర్పించి, కళలను ఆధునీకరించాల్సి ఉంది. జానపదాలను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరముంది. అప్పుడే మన భాష, సంస్కృతులను కాపాడుకున్నవారమవుతాం.
బద్రి కూర్మారావు
97047 98643