Mar 24,2023 22:31

ప్రజాశక్తి-విజయవాడ రూరల్‌
నున్నలోని వికాస్‌ వ్యాయామ విద్య కళాశాల (బిపిఇడి) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన కృష్ణా యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల సాఫ్ట్‌బాల్‌ పురుషుల ఛాంపియన్‌ షిప్‌ను విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాల కైవసం చేసుకుంది. వికాస్‌ బిపిఇడి కాలేజీ రెండో స్థానం, ఉయ్యూరుకు చెందిన ఎజి అండ్‌ ఎస్‌జి సిద్ధార్థ కాలేజీ మూడో స్థానంలో నిలిచాయి. లీగ్‌లో లయోలా కాలేజీ జట్టు మూడు మ్యాచ్‌లలో గెలుపొంది ప్రథమ స్థానంలో నిలవగా, నున్న వికాస్‌ బిపిఇడి కాలేజీ రెండు మ్యాచ్‌లలో, ఎజి అండ్‌ ఎస్‌జి సిద్ధార్థ కాలేజీ ఒక్క మ్యాచ్‌లో గెలుపొందాయి. టోర్నమెంట్‌లో భాగంగా మొదటిస్థానం కోసం ఆంధ్రా లయోలా, నున్న వికాస్‌ బిపిఇడి కాలేజీ జట్ల హోరాహోరీగా మ్యాచ్‌ జరిగింది. మొదటి రెండు ఇన్నింగ్స్‌లలో లయోలా, వికాస్‌ కాలేజీ జట్లు 1-1 పరుగులతో సమ ఉజ్జిగా నిలవగా, మూడో ఇన్నింగ్స్‌ లయోలా జట్టు మరో పరుగును సాధించి ఛాంపియన్‌ షిప్‌ను కైవసం చేసుకుంది. దీంతో వికాస్‌ కాలేజీ జట్టు రెండోస్థానంలో నిలిచింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో విజేతలకు వికాస్‌ విద్యాసంస్థల కార్యదర్శి, కరెస్పాండెంట్‌ నరెడ్ల సత్యనారాయణరెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను కష్ణా యూనివర్సిటీ జట్టుకు ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ జట్టు వచ్చే నెల ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు చండీఘడ్‌లోని పంజాబ్‌ యూనివర్సిటీలో జరగనున్న అఖిల భారత అంతర్‌ విశ్వవిద్యాలయాల సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌లో పాల్గొంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వికాస్‌ బిపిఇడి కాలేజీ ప్రిన్సిపాల్‌, టోర్నమెంట్‌ కార్యనిర్వాహక చైర్మన్‌ డాక్టర్‌ జి.రాజు, కృష్ణా యూనివర్సిటీ సెలెక్షన్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ మండవ కోటేశ్వరరావు, వి.మణిప్రసాద్‌, టోర్నమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి బి.ఉదరుకుమార్‌, వ్యాయామ విద్య అధ్యాపకులు జి.రఘునాథ్‌, డి రత్నబాబు, పి బాలాజీ, టి హనుమంతరావు, ఫిజికల్‌ డైరెక్టర్లు ఎం స్వామి, పి చంద్రబాబు, ఎన్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.