Nov 17,2023 23:02

సాఫీగా సాగేనా?

* ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
* ఈ ఏడాది 5.40 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు
* 390 చోట్ల కేంద్రాల ఏర్పాటు
* రెండు రోజుల్లో ప్రారంభం కానున్న వైనం
అన్నదాతలకు ఈ ఖరీఫ్‌లో సాగు అంతగా కలిసి రాలేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పూర్తిస్థాయిలో విత్తనాలు వేయలేకపోయారు. మరోవైపు చివరి తడులకు నీరందక పంటలు ఎండిపోయిన పరిస్థితులు తలెత్తాయి. వర్షాలు కాస్తా, కూస్తో కురిసిన ప్రాంతాలు, కాలువల కింద ఆయుకట్టు భూముల్లో కొంత వరకు పంట పండింది. జిలాల్లో ఇప్పుడిప్పుడే కోతలు మొదలయ్యాయి. మరోవైపు ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం సేకరణకు పాత నిబంధనలే అమలు చేస్తున్నా... అందులో లోపాలను సవరించి రైతులకు న్యాయం చేస్తామని చెప్తున్నారు.
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి: 
ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌లో 3,51,843 ఎకరాల్లో వరి వేశారు. ఇందులో 3,50,765 ఎకరాలకు పంటల క్రాపింగ్‌ జరిగింది. 3,34,330 ఎకరాలకు ఈకెవైసి పూర్తయింది. ఈ సంవత్సరం 8.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 7,87,447 మెట్రిక్‌ టన్నులు మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం 5.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం వరికి సాధారణ రకానికి రూ.2,183, గ్రేడ్‌ 'ఎ' రకానికి రూ.2,203 మద్దతు ధర ప్రకటించింది. ధాన్యం కొనుగోలుకు అధికారులు జిల్లావ్యాప్తంగా 390 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాలను మూడు కేటగిరీలుగా విభజించారు. 2 వేలు పైబడి ధాన్యం సేకరించే అవకాశం ఉన్న కేంద్రాలను ఎ కేటగిరిగా, వెయ్యి నుంచి 2 వేలు టన్నుల లోపు వరకు కొనుగోలు చేసేవాటిని బి కేటగిరిగా విభజించారు. అదేవిధంగా వెయ్యి టన్నుల కంటే తక్కువ ధాన్యం కొనుగోలుకు అవకాశం ఉన్నవాటిని సి కేటగిరిగా నిర్ణయించారు. జిల్లాలో ఎ కేటగిరిలో 182, బి కేటగిరిలో 176, సి కేటగిరిలో 32 కేంద్రాలు ఉన్నాయి.
ప్రారంభానికి ఏర్పాట్లు
ధాన్యం కొనుగోలుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రాల్లో ధాన్యం నాణ్యతా ప్రమాణాల పరిశీలన, వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు వంటి అవసరాల కోసం టెక్నికల్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, హెల్పర్‌ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికపై 1170 మందిని నియమించారు. వీరికి మండల స్థాయిలో శిక్షణ ఇచ్చారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. మిల్లులకు తరలించిన తర్వాత వాటిని మర ఆడించేందుకు 255 మిల్లులను ఎంపిక చేశారు. మర ఆడించేందుకు ఇస్తున్న ధాన్యం విలువకు సమానమైన బ్యాంకు గ్యారంటీలను మిల్లర్ల నుంచి తీసుకునేందుకు వారితో చర్చలు జరుపుతున్నారు. ఇవన్నీ పూర్తి చేసి మరో రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని అధికారులు చెప్తున్నారు
వాహనాలకు జిపిఎస్‌ పరికరాలు
ధాన్యం సేకరణలో ఈ సంవతసరం కొత్త జిపిఎస్‌ పరికరాలను వినియోగిస్తున్నారు. కళ్లాల నుంచి మిల్లులకు ధాన్యం తీసుకువెళ్లే వాహ నాలకు జిపిఎస్‌ పరికరాలను అమర్చుతున్నారు. ధాన్యం కొనుగోలులో పారదర్శకత కోసం వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. జిల్లాలో 5 వేలు పరికరాలు అవసరమవుతాయని గుర్తించారు. ఇప్పటివరకు 600 వరకు అందుబాటులో ఉంచారు.
సమస్యలను అధిగమిస్తారా?
ధాన్యం కొనుగోలులో గతేడాది రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. మిల్లర్లు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ విలువ పూర్తవడంతో దూర ప్రాంతాల్లోని మిల్లులకు కేటాయించారు. ముఖ్యంగా ఒక మండలానికి చెందిన రైతులకు 40, 50 కిలోమీటర్ల దూరంలో వేరే మండలంలో ఉన్న మిల్లులకు కేటాయించారు. దీంతో రైతులు తీవ్ర వ్యయ ప్రయాసలకు లోనయ్యారు. మిల్లర్లు సకాలంలో బ్యాంకు గ్యారంటీలు సమర్పించకపోవడంతో తమకు కేటాయించిన మిల్లులకు రైతులు ధాన్యం తీసుకువెళ్లలేకపోయారు. గతేడాది జనవరి మొదటి వారం వరకు 72 మంది ధాన్యం నాణ్యంగా లేవంటూ కొన్ని చోట్ల రైతులను తిప్పి పంపారు. కొన్ని ఆర్‌బికెల్లో తమ లక్ష్యం పూర్తయిందని, ఇక కొనలేమంటూ సిబ్బంది చెప్పడంతో దళారులకు తక్కువ రేటుకే అమ్ముకోవాల్సి వచ్చింది. గతేడాది నుంచి ధాన్యం కొనుగోలుకు యాప్‌ వినియోగించడంతో సర్వర్‌, సిగల్‌ సమస్యలు తలెత్తడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. వీటిని అధిగమిస్తే ధాన్యం సేకరణకు ఉన్న ఇబ్బందులు అధిగమించే అవకాశాలు ఉన్నాయి.
పంటన్నంటినీ కొనుగోలు
ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రెండు రోజుల్లో కొనుగోలు ప్రారంభిస్తాం. ధాన్యం కొనుగోలుకు ఎటువంటి లక్ష్యం లేదు. ఈ క్రాప్‌లో నమోదైన పంటనంతటినీ కొనుగోలు చేస్తాం. రైతులు ప్రభుత్వం సూచించిన నాణ్యతా ప్రమాణాలకనుగునంగా ధాన్యాన్ని సిద్ధం చేసి తీసుకురావాలి.
- కె.శ్రీనివాసు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌