ప్రజాశక్తి - విజయవాడ : షాపు గుమస్తాలకు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరుతూ షాపు ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం లెనిన్ సెంటర్‌లో ధర్నా జరిగింది. ప్రభుత్వానికి, షాపుల యాజమాన్యానికి వ్యతిరేకంగా షాపు గుమస్తాలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు దోనేపూడి కాశీనాధ్, జిల్లా అధ్యక్షులు ఎ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...పెరిగిన ధరలకనుగుణంగా విజయవాడ నగరంలో పని చేస్తున్న షాపు గుమస్తాలకు జీతాలు పెంచాలని, లేనట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పలు సార్లు ఆందోళనలు, వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం ఉండటం లేదని అన్నారు. విజయవాడ నగరంలో వివిధ వ్యాపార వాణిజ్య సముదాయాలలో 45 వేల మందికి పైగా షాపు, షాపింగ్ మాల్స్‌లో షాపు గుమస్తాలు పని చేస్తున్నారని, వీరిలో 45 శాతం మంది శ్రామిక మహిళలు పని చేస్తున్నారని అన్నారు. వీరందరికీ పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జీతాలు పెంచాల్సి వుందని అన్నారు. కానీ 15 సంవత్సరాలు కావస్తున్నా షాపు గుమస్తాలకు జీతాలు పెంచలేదని మండిపడ్డారు. కనీస వేతనం సవరిస్తూ జీఓ చేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి భారం పడదని అన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు సెంట్రల్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు కె. దుర్గారావు, ఎం.వి సుధాకర్, షాప్ ఎంప్లాయిస్ యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు జి.వెంకటేశ్వరావు (కొండ) వై.సుబ్బారావు,షాప్ ఎంప్లాయిస్ యూనియన్ నగర నాయకులు జి.ఈశ్వర్ కుమార్, సి.హెచ్.శివరావు, షాపు గుమస్తాలు పాల్గొన్నారు.










