ప్రజాశక్తి-హిందూపురం : కార్మికులను వేధిస్తున్న శానిటరి ఇన్స్‌పెక్టర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప, పారిశుధ్య కార్మికులు డిమాండ్ చేశారు. శానిటరి ఇన్స్‌పెక్టర్ తీరును నిరసిస్తు గురువారం ఉదయం పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా అందరు కలిసి మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డిలకు శానిటరీ ఇన్స్‌పెక్టర్‌పై ఫిర్యాదు చేశారు. అనంతరం సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప, ఎపి మున్సిపల్ వర్కర్స్, అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతు పురపాలక సంఘంలో పారిశుధ్య విభాగంలో విధులు నిర్వహిస్తున్న శానిటరీ ఇన్స్‌పెక్టర్ రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులపై విక్షణ రహితంగా వ్యవహరిస్తు, దుర్బాషాలడుతున్నారన్నారు. ఆయనను ప్రశ్నించిన వారిపై పని ఒత్తిడి పెంచడం, పని ముట్లు ఇవ్వకపోవటం లాంటి వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. వెంటనే ఇతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మల్లికార్జున, ఆనంద్, మంజునాథ్, నారాయణ, చంద్ర, నాగేంద్ర, రామంజి, శివకుమార్, గురునాథ్, రామచంద్ర, కృష్ణమూర్తి, ఓబులమ్మ, శోభమ్మ, సుబ్బలమ్మ, లక్ష్మమ్మ, కవితమ్మ, క్లాప్ ఆటో డ్రైవర్లు అనిల్, కిషోర్, ప్రభాకర్‌తో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.










