May 20,2023 00:31

పాడేరులో నినాదాలు చేస్తున్న కార్మికులు

ప్రజాశక్తి-పాడేరు: తమ వేతన సమస్యల పరిష్కారం కోసం అల్లూరి జిల్లా పాడేరు డివిజన్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్‌ కార్మికులు శుక్రవారం తమ విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు. చింతపల్లి, పాడేరు, ముంచంగిపుట్టు, అరకు ఆస్పత్రులలోని శానిటేషన్‌ కార్మికులు సుమారు 56 మంది శుక్రవారం సమ్మెలో భాగంగా తమ విధులను బహిష్కరించి ఆసుపత్రుల ముందు బైఠాయించారు. పాడేరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న 22 మంది శానిటేషన్‌ కార్మికులు సమ్మెకు ఉపక్రమించి ఆసుపత్రి ముందు బైఠాయించారు. దీర్ఘకాలంగా ఉన్న తమ వేతన సమస్యల పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని నినదించారు. పాడేరు జిల్లా ఆసుపత్రిలో శానిటేషన్‌ కార్మికులు అందరూ సమ్మె చేపట్టడంతో పారిశుద్ధ్య పనులు స్తంభించాయి. ఈ ఆసుపత్రిలో వంద పడకల నుంచి 200 పడకలకు విస్తరించినప్పటికీ శానిటేషన్‌ సిబ్బందిని పెంచలేదు. దీంతో, ఈ ఆసుపత్రిలో శానిటేషన్‌ సిబ్బంది కొరత కూడా ఉంది. తాము తీవ్ర పని భారాన్ని, పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు ఎల్‌.సుందర్‌రావు మాట్లాడుతూ, ఆస్పత్రుల శానిటేషన్‌ కార్మికుల వేతన సమస్యల పరిష్కారం పై వైద్య విధాన పరిషత్‌ అధికారులు శ్రద్ధ చూప లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అనేకసార్లు కార్మికుల వేతన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు. ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26 వేలు చెల్లించాల్సి ఉందని, కొన్ని ఆసుపత్రుల్లో కార్మికులకు రూ.10,700. మరికొన్ని ఆసుపత్రుల్లో 9,500 చొప్పున చెల్లిస్తున్నారని తెలిపారు. పిఎఫ్‌ ఈఎస్‌ఐ సక్రమంగా చెల్లించలేదని విమర్శించారు.కార్మికులు చేపడుతున్న సమ్మెతోనైనా అధికారులు స్పందించి వేతన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు కాంట్రాక్టు విధానం రద్దు చేసి, వైద్య విధాన పరిషత్‌ ద్వారా జీతాలు చెల్లించాలని, ప్రతి ఆస్పత్రిలో సరిపడా సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు.2019 నుంచి కార్మికుల జీతాలు పెంచలేదని, గత నాలుగేళ్లలో అన్ని నిత్యావసర ధరలు రెట్టింపు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పారిశుద్ధ్య సంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌.ముత్యాలమ్మ, సుధారాణి, ఘటి, పుణ్యవతి, రాజేశ్వరి, సింహాచలం, నాగేశ్వరరవు, శివ, పాల్గొన్నారు.
ముంచింగిపుట్టు:మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు అధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. లక్ష్మీపురం సర్పంచ్‌ కొర్ర త్రినాధ్‌ మాట్లాడుతూ, కనీస వేతనం రూ:26000 చెల్లించాలని, అన్ని ఆసుపత్రులలో సరిపడా సిబ్బందిని నియమించాలన్నారు. జీతంతో కూడిన సెలవులు మంజూరు చేయాలన్నారు. పేసియల్‌ యాఫ్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.ధర్మారావు, ఎం.సుబ్రమణ్యం, వి.నారాయణ, కే.సుభ్బలక్ష్మి, గాసన్న, దేవి, వసంత, సీఐటీయూ జిల్లా నాయకులు పి.భీమరాజు, కే కేశవరావు పాల్గొన్నారు.
అరకులోయ రూరల్‌:అరకువేలి ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొంతకాలంగా పారిశుధ్య కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కాంట్రాక్టర్‌, వైద్యాధికారులకి విన్నవించినా పట్టించుకోలేదని అందుకే సమ్మెకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశుద్య కార్మికుల సంఘం నాయకులు రఘు, ద్రౌపతి, మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.