Apr 15,2023 00:43

బాధ్యతలు స్వీకరిస్తున్న ఐజి పాల్‌రాజ్‌

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు రేంజ్‌ నూతన ఐజిగా పాల్‌రాజు శుక్రవారం స్థానిక రేంజ్‌ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భ ంగా ఆయన మీడియాతో మాట్లాడు తూ ఎన్నికల సంవత్సరం వల్ల రాజకీయ కార్యాకలాపాలు పెరుగుతు న్నాయని వీటిని నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఐదుగురు ఎస్పీలు, సిబ్బందిని సమన్వయం చేసుకుని ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. దిశా కేసులకు సంబంధించి ఇన్‌ఛార్జి ఐజిగా బాధ్యతలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, మైనర్‌ బాలికలపై భద్రతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. మహిళలపై దాడులను ప్రాథమిక దశలోనే నిరోధిస్తామని, ఇందుకు సంబంధించి ముందస్తు చర్యలు చేపడుతామని చెప్పారు. నేరాలు జరిగాక త్వరితగతిన బాధితులకు న్యాయం జరిగేలా నిందితుల అరెస్టు మొదలు శిక్షలు పడేంత వరకు కృషి చేస్తానని తెలిపారు. నిందితులను అరెస్టు చేస్తున్నా శిక్షలు పడటం ముఖ్యమని, గుంటూరులో రమ్య హత్య కేసులో నిందితునికి ఉరి శిక్ష పడినట్టు మిగతా కేసుల్లోనూ నిర్ధేశిత కాలవ్యవధిలో శిక్షలు పడేలా కృషి చేస్తామని అన్నారు. సైబర్‌ నేరాల అదుపునకు చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్‌ నేరాల్లో మోసపోయే వారంతా విద్యావంతులేనని, వీరు నిరంతరం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మిస్డ్‌ కాల్‌ ఇచ్చిన మోసాలు జరుగుతున్నాయని వీటిని ప్రజలంతా గమనించాలని కోరారు. సైబర్‌ నేరాల్లో చదువుకున్న తెలివిగల నేరస్తులు ఎక్కువగా ఉంటున్నారని అన్నారు. గతంలో నెల్లూరు జిల్లా విజిలెన్సు ఎస్‌పిగా పనిచేశానని, ఈ రేంజ్‌పై అవగాహన ఉందని అన్నారు. సిబ్బంది సంక్షేమం, అధికారులకు పాలనపరమైన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని తెలిపారు. అంతకు ముందు రేంజ్‌ కార్యాలయంలో పోలీసు సిబ్బంది ద్వారా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రేంజ్‌ పరిధిలో ఉన్న జిల్లా ఎస్‌పిలు రవిశంకర్‌రెడ్డి, (పల్నాడు), మల్లిక (ప్రకాశం), తిరుమలేశ్వరరెడ్డి (నెల్లూరు), వకుల్‌ జిందాల్‌ (బాపట్ల), ఆరీఫ్‌ హఫీజ్‌( గుంటూరు) ఐజిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.