Aug 07,2023 19:52

కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

ప్రజాశక్తి - ఆదోని
సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆదోని డీఎస్పీ శివ నారాయణ స్వామి హెచ్చరించారు. ప్రజల్లో ఎలాంటి భయాందోళన ఉండకూడదని, వారిలో భయం పోగొట్టేందుకు రాపిడ్‌ ఫోర్స్‌ ద్వారా పట్టణంలో భారీ ఎత్తున కవాతు నిర్వహించారు. సోమవారం పట్టణంలోని వన్‌ టౌన్‌, టూ టౌన్‌, త్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఆయా వీధుల్లో ఆర్‌ఎఎఫ్‌, హైదరాబాద్‌కు చెందిన 99 బెటాలియన్‌ ఫోర్స్‌ డిప్యూటీ కమాండర్‌ టిపి భఘేల్‌ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. పొజిషన్‌ నుంచి భీమా సర్కిల్‌, శ్రీనివాస్‌ భవన్‌ సర్కిల్‌, పెద్ద మసీదు, బంగారు బజార్‌, బొడ్డేకల్‌, హవన్నపేట సర్కిల్‌, తిక్క స్వామి దర్గా సర్కిల్‌, ఎమ్మిగనూరు టర్నింగ్‌, చందా సాహెబ్‌ దర్గా ప్రాంతాల్లో కవాతు సాగింది. ప్రజల్లో పోలీసులపై నమ్మకం కల్పించడం, పోలీసు వ్యవస్థ గట్టిగా ఉందని భరోసా ఇస్తున్నట్లు ఆర్‌ఎఎఫ్‌ ఫోర్స్‌ డిప్యూటీ కమాండర్‌ భఘేల్‌ వివరించారు. గత రెండేళ్ల క్రితం పట్టణంలో కవాతు నిర్వహించినట్లు తెలిపారు. తమ 99 ఫోర్స్‌ బెటాలియన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కవాతు నిర్వహించి ప్రజల్లో భయాందోళన పోగొట్టినట్లు చెప్పారు. ఆదోని సిఐలు విక్రమ్‌ సింహ, నరసింహ రాజు, ఆర్‌పిఎఫ్‌ 99 ఇన్‌స్పెక్టర్లు ఎకె.శర్మ, శంకర్‌ యాదవ్‌, రాబిన్‌ బాబు పాల్గొన్నారు.