ప్రజాశక్తి-నెల్లూరు :ఎవరైనా.. ఎంతటి వారైనా జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని ఎస్‌పి డాక్టర్ కె.తిరుమలేశ్వరరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ డిజిపి ఆదేశాలతో కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తూ నేరాలు జరిగిన సందర్భంలో అనుమానితులను, నిందితులను పోలీసులు ఎంత తొందరా అదుపులోకి తీసుకుంటారో ఆదే విధంగా కోర్టుకు పక్కాగా ఛార్జీ షీట్ దాఖలు చేయడం, సాక్షులను ప్రవేశపెట్టడం వంటివి పూర్తి చేసి త్వరగా నిందితులకు శిక్షపడేలా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందన్నారు. ఇందుకు ఉదాహరణ గత ఏడాది సెప్టెంబరు మాసంలో 23వ తేదిన సిఎఎం స్కూల్ ఆవరణంలో ఆమ్మజాన్ దర్గా వద్ద చోటు చేసుకున్న హత్యకు సంబంధించిన నిందితుడిని అరెస్టు చేయడం,తక్కువ వ్యవదిలో కోర్టుకు చార్జి షీట్ దాఖలు చేశామన్నారు. ఈ కేసులో నిందితుడి షేక్ ఖాజా పాత నేరస్థుడే అని, అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి ఉందని, 2007 నుంచి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతూ జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో 37 కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఈ కేసులో త్వరితగతిన నిందితుడికి శిక్ష పడేలా ప్రతిభను కనపరిచిన డిఎస్‌పి శ్రీనివాసరెడ్డి, చిన్నబజారు పోలీసు స్టేషన్ సిఐ అశోక్‌కుమార్, మహిళా ఎస్‌ఐ ఎస్‌డి లతీపున్సిసా, కోర్టు కానిస్టేబుల్‌కు రివార్డులు అందజేసి అభినందించారు. అదనపు ఎస్‌పి , నగర డిఎస్‌పి పాల్గొన్నారు.










