ప్రజాశక్తి - చిప్పగిరి
గ్రామీణ ప్రాంతాల్లో ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమాలను మరిచిపోకుండా, గ్రామంలో శాంతి కోసం, మంచి పంటలు పండడానికి ఈ దేవర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. బుధవారం మంత్రి స్వగ్రామమైన గుమ్మనూరులో సర్పంచి లక్ష్మీదేవి, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మారెమ్మ అవ్వ దేవర నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి కుంభాలను మేళతాళాలతో వెళ్లి మారెమ్మ అవ్వకు పూజలు నిర్వహించారు. వైసిపి మండల కన్వీనర్ గుమ్మనూరు నారాయణ నిర్వహించిన కుంభం మహిళలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడారు. గ్రామంలో ప్రజలంతా ఒక కుటుంబంలాగా ఈ దేవర నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేవర సందర్భంగా గ్రామంలో చిన్ననాటి మిత్రులను, స్నేహితులను ఆప్యాయంగా కలుసుకోవడం మరుపురాని ఘట్టమన్నారు. గ్రామంలో ప్రధాన సమస్యలైన తాగునీటి కొరత రానివ్వకుండా చూసుకుంటున్న సర్పంచికి కృతజ్ఞతలు తెలిపారు. మనిషి ఎంత ఎదిగినా స్వగ్రామంపై మమకారం ఉంటుందన్నారు. నేడు తన పేరు కన్నా ముందు గుమ్మనూరు ఊరు పేరు రావడం తన అదృష్టమని చెప్పారు. మంచి వర్షాలు కురిసి పాడిపంటలు, దిగుబడులు రావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పరిపాలన ప్రజలు మెచ్చే విధంగా అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవరగట్టు ఆలయ ఛైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు, ఎంపిపి భర్త జూటూరు మారయ్య, ఏరూరు రంగస్వామి పాల్గొన్నారు.
గుమ్మనూరులో మారెమ్మ అవ్వకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మంత్రి, కుటుంబ సభ్యులు










