'అదో మహా విషాదం. అక్కడి దశ్యాలూ, వాసనలూ, భీకర విధ్వంసం, కరిగి మెలికలు తిరిగిపోయిన ఆ భారీ భవంతుల అస్థిపంజరాలూ, ఆ శిథిలాలూ, కాలిపోయిన మతదేహాల కమురు వాసనా... ఆ దశ్యాలు నన్ను విచలితున్ని చేశాయి' అంటూ... అమెరికాలో 2001, సెప్టెంబరు 11న జరిగిన దారుణ ఘటన గురించి జాన్ పెర్కిన్స్ 'ఒక దళారీ పశ్చాత్తాపం' పుస్తకంలో చెబుతాడు. అమెరికా పెంచి పోషించిన ఆఫ్ఘన్ ఉగ్రవాదులు చేపట్టిన మారణహోమం అది. ఈ మారణహోమంలో మొత్తం 2,996 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 వేల మంది సాధారణ పౌరులు క్షతగాత్రులయ్యారు. దీనికి ప్రతీకారంగా బిన్ లాడెన్‌ను అప్పగించాలని, అమెరికా-నాటో దళాలు ఆఫ్ఘన్‌పై 20ఏళ్ల పాటు దాడులు కొనసాగించాయి. పెంటగాన్ వెల్లడించిన లెక్క ప్రకారం... 93,527 వైమానిక దాడులు జరిగాయి. 20 వేల మంది ఉగ్రవాదుల్ని హతమార్చారు. 48 వేల మంది అఫ్గాన్ పౌరులు మరణించారు. ఈ సైనిక చర్యకు, అమెరికా పున్ణనిర్మాణానికి అమెరికా 2 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి.
ఇవన్నీ ఒక ఎత్తైతే... ఆఫ్ఘనిస్తాన్ అప్పుడెలా వుందో.. ఇప్పుడూ అలాగేవుంది. ఇస్రాయిల్- పాలస్తీనా గొడవ... ఇప్పటికీ తెగలేదు. అక్కడ ఎలాంటి అభివృద్ధీలేదు. సద్దాంను హతమార్చిన తర్వాత కూడా ఇరాక్‌లో ఇప్పటికీ శాంతియుత జీవనం లేదు. సిరియా, ఇరాన్, ఇరాక్ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో సుమారు 2 లక్షల 75 వేల మంది చనిపోయారు. శాంతిని స్థాపించడానికి వెళ్లిన అమెరికన్ సైనికులతో చేయించిన దారుణాలు, అకృత్యాల ఫలితంగా... ఆ సైనికులే అశాంతికి, ఉద్వేగఘాతానికి, ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చింది. సాధారణ ప్రజలుండే నగరాలపై బాంబుదాడులు చేశారు. యుద్ధంతో ఏమాత్రం సంబంధంలేని సామాన్య ప్రజల్ని బలి తీసుకున్నారు. 'తప్పిపోయింది... కనబడటం లేదు/ ఎక్కడుందో శాంతి అనే నా చెల్లి/ తన కోసం వెతకండి' అంటాడు తిలక్. ప్రపంచ శాంతికి భంగం కలిగిన ప్రతిచోటా... సామ్రాజ్యవాదపు ఆధిపత్య కాంక్ష, తన మాటే నెగ్గాలనుకునే దురహంకారం వుంటుంది. అది వున్నచోట అశాంతి నెలకొనక తప్పదు. సోషలిజం పడిపోయిన తర్వాత తామే ప్రభువులమని, తమ ఆధిపత్యమే నెగ్గాలని అనుకోవడం ఈ అశాంతికి మూలం. దీని వెనుక బడా కార్పొరేట్లు.. బడా బహుళజాతి సంస్థల లాభాల దురాశ తిష్టవేసుకొని వున్నాయి. సామ్రాజ్యవాదం సంక్షోభంలో పడినప్పటికీ దానినుంచి బయటకు రావడానికి కూడా యుద్ధాలనే ఎంచుకుంటుంది. మితిమీరిన అణ్వస్త్రాల నిల్వలు, ఆధునిక సాంకేతికతతో యుద్ధోన్మాదం చేయిదాటిపోతోంది. 'మూడో ప్రపంచ యుద్ధం ఎలా జరుగుతుందో తెలియదు కానీ... నాల్గవ ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్లతోటి, కర్రలతోటే జరుగుతుంది' అని ఐన్‌స్టీన్ అన్నాడు.
క్రూర మృగాలు సైతం తమ కడుపు నిండిన తర్వాత దాడి చేయవు. కానీ.... సామ్రాజ్యవాదం కడుపు ఎప్పటికీ నిండదు. కనుక సామ్రాజ్యవాదం ప్రపంచశాంతికి ప్రథమ శత్రువు. ఇది పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత రూపం. అందుకే సామ్రాజ్యవాదం వున్నంత కాలం యుద్ధాలు తప్పవు. సోషలిజం బలంగా వున్నంతకాలం వీరికి పక్కలో బల్లెంలా వుంది. సోషలిజం పడిపోయిన తర్వాత అమెరికా ఆగడాలు మితిమీరాయి. ఇప్పుడు చైనా చుట్టూ యుద్ధ కూటములను నిర్మించి, యుద్ధ వాతావరణాన్ని రెచ్చగొడుతోంది అమెరికా. భారతదేశాన్ని కూడా ఈ కూటమిలోకి లాగడానికి ప్రయత్నిస్తోంది. తన లాభాపేక్షకు, ఆధిపత్య కాంక్షకు మనలను కూడా బలి చేయాలని చూస్తోంది. బుద్దుడు పుట్టిన దేశమనో, గాంధీ పుట్టిన దేశమనో ఎన్ని శాంతి ప్రవచనాలు చెప్పుకున్నా.... అమెరికా కుతంత్రాలనుంచి బయటకు వస్తేనే మనం వల్లించే శాంతి మంత్రాలకు విలువ వుంటుంది. అమెరికా అనబడే ఆ పెద్దపులితో సావాసం చేసినంతకాలం ప్రమాదం తప్పదు. మోడీ దేశాన్ని ఆ దిశగానే నడిపిస్తున్నాడు. ప్రపంచ శాంతి సూచీ- 2021 ప్రకారం మన దేశం 135వ స్థానంలో వుండడం దీనికి ఉదాహరణ. 'ఓ ప్రపంచమా/ ఓ సారిటు చూడు/ శాంతి గంటలు మాకు కావాలి/ నిరాయుధీకరణకై/ నిత్యం మోగిస్తాం' అంటారో కవయిత్రి. యుద్ధ భయం లేని, అణ్వాయుధాలు, రక్తపాతం లేని శాంతియుత ప్రపంచం దిశగా భావితరాన్ని నడిపించాలి. అదే శాంతికాముకులందరి కర్తవ్యం.










