ప్రజాశక్తి-రౌతులపూడి శాంతి భద్రతలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏలూరు రేంజ్ డిఐజి జి.అశోక్ కుమార్ తెలిపారు. మండల కేంద్రమైన రౌతులపూడిలో నూతన అవుట్ పోలీస్ స్టేషన్‌ను ఆదివారం కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్, ఎంఎల్‌ఎ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ డిజిపి రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలో మహిళల భద్రత, గంజాయి రవాణా, మత్తు పదార్థాల నివారణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. యువత మత్తు పదార్థాలు అలవాటు పడకుండా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. రౌతులపూడి కేంద్రంగా అవుట్ పోలీస్ స్టేషన్ ప్రారంభించడంతో 26 గ్రామాల ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. న్యాయపరమైన ఇబ్బందులు తొందరలోనే పరిష్కారమై రౌతులపూడి కేంద్రంగా పూర్తిస్థాయి పోలీస్ స్టేషన్ సేవలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌పి సతీష్ కుమార్, ఎఎస్‌పి పి.శ్రీనివాస్, బి.సత్యనారాయణ, డిఎస్‌పి లతా కుమారి, ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు, జెడ్‌పిటిసి గొల్లు లక్ష్మణ మూర్తి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రమణమ్మ, డిసిసిబి డైరెక్టర్ మధు, సర్పంచ్ అర్జమ్మ, ఎస్‌ఐ అబ్దుల్ నబీ తదితరులు పాల్గొన్నారు.










