ప్రజాశక్తి - టి.నరసాపురం
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, వాటికి ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటాయని జిల్లా ఎస్‌పి డి.మేరీప్రశాంతి హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్‌పి మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం స్టేషన్ ప్రాంగణంలో మొక్కను నాటారు. పలు కేసుల దర్యాప్తును పరిశీలిం చారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. వ్యసనపరులకు, రౌడీషీటర్లకు ప్రతీవారం కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. నేరచరిత్ర ఉన్న వారి జీవన విధానాలపై నిఘా ఉంచా లన్నారు. దిశా యాప్‌పై విద్యార్థులకు కల్పించాలని, సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అవగాహన కల్పించాలని సూచించారు. మహిళా పోలీసులకు కేటాయించిన జాబ్ చార్డు తూచా తప్పకుండా నిర్వర్తించాలన్నారు. ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని, సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, మహిళా పోలీసు లకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలవరం డిఎస్‌పి శ్రీనివాసులు, జీలుగుమిల్లి సిఐ బి.వెంకటేశ్వ రరావు, ఎస్‌ఐ కె.సతీష్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
జీలుగుమిల్లి : శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటాయని ఎస్‌పి డి.మేరీ ప్రశాంతి హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సర్కిల్ కార్యాలయాన్ని, జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌ను ఆమె మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించారు. పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్‌పి మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో భూ తగాదాలపై దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. అదే విధంగా అంతర్‌రాష్ట్ర సరిహద్దు మండలం కావడంతో జాతీయ రహదారి గుండా గంజాయి, మద్యం, గుట్కా వంటి అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ అవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పోలవరం డిఎస్‌పి ఎ.శ్రీనివాసులు, సిఐ బి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ వి.చంద్ర శేఖర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.










