
ప్రజాశక్తి - బలిజిపేట : జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయమని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక స్థానిక పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ నిర్వాహణ, రికార్డులను పరిశీలించి ఎస్సై ప్రశాంత్ కుమార్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాను విధుల్లోకి చేరిన నాలుగు నెలల్లో క్రైమ్ శాతం 30 వరకు తగ్గించానని, అలాగే శాంతి భద్రతల విషయంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక గ్రామాలపై దృష్టి పెట్టి శాంతి భద్రతలు చేపడుతున్నట్లు తెలిపారు. దిశా యాప్ డౌన్‌లోడ్‌లపై అవగాహన కల్పిస్తూ ఇంతవరకు సుమారు 6 వేల యాప్‌లను ఇన్‌స్టాల్ చేయించామని తెలిపారు. ఇందుకు సహకరించిన మహిళా పోలీసులను ఆయన అభినందించినట్లు తెలిపారు. రోడ్డు భద్రత, నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక అనుసరించాలని, ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ట్రిపుల్ డ్రైవింగ్ విషయంలో క్షమించేది లేదని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రధాన రహదారి పక్కన నో పార్కింగ్ ప్రదేశాల్లో లారీలు నిలుపుదల నిర్మూలన చేస్తున్నామన్నారు. శాంతి భద్రతల విషయంలో పెట్రోలింగ్‌ను నిబంధనలను బట్టి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 20 పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ పైఅధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ వర్షాకాలంలో ముంపునకు, శిథిలావస్థలో ఉందని తెలుసుకున్న ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి స్టేషన్ విషయంలో కొత్త పోలీస్ స్టేషన్ నిర్మాణానికి సన్నాహాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. దిశా, ఫోక్సో చట్టాలపై 16 నుంచి 18 ఏళ్లలోపు అమ్మాయిలకు పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికలు ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సమస్యాత్మక గ్రామాల్లో బైండోవర్, ఇతర నిబంధనలతో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతున్నట్టు తెలిపారు. దీపావళి నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా మందుగుండు సామాన్లు విక్రయించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, ఎస్‌పి వెంట ఎస్స్‌ై ప్రశాంత్ కుమార్, ఎఎస్‌ఐ పాణిగ్రహి, పలువురు కానిస్టేబుళ్లు ఉన్నారు.