ప్రజాశక్తి-విజయవాడఅర్బన్: రాష్ట్రస్థాయి 25వ పాలిటెక్నిక్ క్రీడా పోటీల్లో గురువారం ఉత్సాహభరిత వాతావరణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన విద్యార్ధులు తమ సత్తా చాటేందుకు పోటీ పడుతుండగా సాయంత్రం విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవం అదరహో అనిపించింది. రీమిక్స్ పాటలకు చేసిన నృత్యాలు ఆహుతుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసాయి. వడ్డేశ్వరం కెఇఎస్ పాలిటెక్నిక్ విద్యార్ధులు కూచిపూడి నృత్యంతో సాంస్కృతిక ఉత్సవ్‌కు ఘన స్వాగతం పలకగా, విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్దులు రీమిక్స్ హోరుకు అందించిన జోరైన నృత్యాలు ఉర్రూతలూగించాయి. దాదాపు గంటకు పైగా సాగిన క్యాంప్ ఫైర్ యువతకు నూతన ఉత్తేజాన్ని అందించింది. తమలో దాగి ఉన్న ప్రతిభకు దీనిని వేదికగా భావించిన విద్యార్ధులు విభిన్న కోణాలను ప్రదర్శించారు. సాంస్కృతిక ఉత్సవ్‌కు ముఖ్యఅతిధిగా హాజరైన రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ విద్యార్థులలోని క్రీడా నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్ధులు తరగతి గదులకే పరిమితం కాకుండా శారీరక, మానసిన వికాసానికి తోడ్పాటును అందించే క్రీడలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 1500 మంది విద్యార్ధులు మొత్తం 19 అంశాలలో పోటీ పడుతున్నారని, శుక్రవారం విజేతల వివరాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యా శాఖ సంయుక్త సంచాలకులు పద్మారావు, సాంకేతిక విద్యా బోర్డు కార్యదర్శి విజయ భాస్కర్, సంయుక్త కార్యదర్శి జానకీరామయ్య, ప్రిన్సిపల్ విజయసారధి తదితరులు పాల్గొన్నారు.










