
ప్రజాశక్తి-గుంటూరు : సమాజంలో పెంచి పోషిస్తున్న సాంస్కృతిక కాలుష్యంపై గుర్రం జాషువా సాహిత్య స్ఫూర్తితో అభ్యుదయ వాదులు, సాహితీవేత్తలు పోరాడాలని పిడిఎఫ్ మాజీ ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బ్రాడీపేటలోని జాషువా విజ్ఞాన కేంద్రంలో గుర్రం జాషువా 128వ జయంతిని పురస్కరించుకొని 'జాషువా సాహిత్యం- సామాజిక న్యాయం' అంశంపై సభ నిర్వహించారు. తొలుత జాషువా విగ్రహానికి విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు ప్రొఫెసర్ రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డికి ఈ ఏడాది జాషువా కవితా పురస్కారాన్ని వి.బాలసుబ్రహ్మణ్యం ద్వారా ప్రదానం చేశారు. కెఎస్ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సభలో వి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశంలో కులం, వర్గం వేరుకాదని, అందుకే కులాన్ని, ఆర్థిక అసమానతల్ని జాషువా తన సాహిత్యంలో కలిపి రచనలు చేసి ఉంటారని అన్నారు. జాషువా ఒక వర్గానికి, ఒక తరగతికి పరిమితమైన వాడు కాదని, సమగ్రమైన కవి అని కొనియాడారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలోనూ ఇప్పటికీ కులం మారలేదన్నారు. ఒక పథకం ప్రకారం సోషల్ ఇంజినీరింగ్‌ను వ్యవస్థీకృతం చేయటానికి ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వెలిబుచ్చారు. మూఢనమ్మకాలు, చరిత్ర పట్ల తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో నేటి సాంస్కృతిక కాలుష్యాన్ని అర్థం చేసుకొని, జాషువా స్ఫూర్తితో అందరం న్యాయం కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే భవిష్యత్ అంధకారం అవుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే జాషువా కవిత్వాన్ని అందరూ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పురస్కార గ్రహీత ప్రొఫెసర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో జాషువా, గురజాడ వంటి వారి అవసరం ఎంతో ఉందన్నారు. ఒకప్పుడు భారతీయులు బ్రిటీషు వారితో పోరాడారని, ఇప్పుడు భారతీయులతోనే పోరాడాల్సి వస్తోందని అన్నారు. జాషువా లాంటి వారు నేడు ఉండి ఉంటే దేశద్రోహులని ముద్ర వేసేవారని అన్నారు. అసమానతలున్న సమాజాన్ని ఎందుకు సృష్టించావని ప్రశ్నించిన జాషువా దేవుడిపై యుద్ధ ప్రకటించాడని చెప్పారు. కులభావన ఉన్న భారతదేశంలో ఆర్థిక, రాజకీయ విప్లవం కంటే ముందుగా సాంఘిక విప్లవం రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సాంఘిక విప్లవం రాకుండా ఆర్థిక, రాజకీయ విప్లవం వచ్చినా అది నిలవదని జాషువా భావనగా వివరించారు. జాషువా కోరుకున్నట్లు కుల, మతాలకు అతీతంగా దేశం పున:నిర్మాణం జరగాల్సిన తరుణంలో అందుకు భిన్నంగా తిరోగమనంలో నిర్మించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. జాషువా శ్రామికులు, దళితులు, మహిళలు, నష్టపోయిన వారి పక్షపాతి అని, స్వచ్ఛమైన న్యాయకవి అని కొనియాడారు. జాషువా సాహిత్యాన్ని చాలా ఆలస్యంగా గుర్తించామని, ఇప్పటికైనా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు.
జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ పాశం రామారావు మాట్లాడుతూ గుర్రం జాషువా గుంటూరు వాసి కావటం గర్వకారణం అన్నారు. 2012 నుండి జాషువా పేరుతో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. భవిష్యత్‌లో ఈ వేదిక ద్వారా బముముఖ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ గతంలో జాషువా కవితా పురస్కారాన్ని గోరంటి వెంకన్న, రచయిత చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, కత్తిపద్మారావు, నల్లిధర్మారావు, ఓల్గా వంటి అనేక మంది సామాజిక కవులు, రచయితలకు అందచేసినట్లు చెప్పారు. ఈ ఏడాది ప్రముఖ సామాజిక కవి, సాహితీ విమర్శకులు చంద్రశేఖర్‌రెడ్డికి పురస్కారం ఇవ్వటం ముదావహమని అన్నారు. సభలో జాషువా సాహిత్య తెలుగు అనువాదకురాలు హేమలత, జాషువా విజ్ఞాన కేంద్రం కార్యదర్శి నూతలపాటి కాళిదాసు, పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. సభలో తొలుత ప్రజానాట్య మండలి కళాకారులు జగన్, ఎస్.పద్మ, డి.శ్రీనివాస్, లూథర్‌పాల్ తదితరులు అభ్యుదయ గేయాలు ఆలపించారు.