ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ: సాంకేతిక ప్రగతి, ఆవిష్కరణలు విసిరే సవాళ్లను స్వీకరించడానికి యువత సిద్ధంగా ఉండాలని పల్సస్ సంస్థ సిఇఒ డాక్టర్ జి.శ్రీనుబాబు అన్నారు. మంగళవారం ఏయూ అసెంబ్లీ మందిరంలో నిర్వహించిన ఫార్మశీ కళాశాల 72వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏయూ ఫార్మశీ కళాశాల విద్యార్థిగా చేరిన నాటి నుంచి నేడు సిఇఒగా ఎదిగిన ప్రస్థానాన్ని విద్యార్థులకు వివరించారు.
ఫార్మశీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య వై.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, యువతలో ఉద్భవించే నవ్య ఆలోచనలు కార్యరూపంలో చూపాలన్నారు. విశ్రాంత ప్రిన్సిపల్ ఆచార్య కెవి.రమణమూర్తి మాట్లాడుతూ, విద్యార్థుల్లో ఉన్న బహుళ నైపుణ్యాలను ప్రస్పుటం చేయడానికి, ఆర్గనైజేషనల్ స్కిల్స్ పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో విభాగ ఆచార్యులు జి.గిరిజాశంకర్, ఎకెఎం పవార్, కె.ఈశ్వర్‌కుమార్, ఎం.మురళీకృష్ణకుమార్, పి.శైలజ తదితరుల ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.










