Jul 21,2023 22:33

సమావేశంలో మాట్లాడుతున్న జెసి నవీన్‌

- జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు మరింత లబ్ధి చేకూరేలా వ్యవసాయ సలహా మండలి కృషి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జెసి అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రైతులకు మేలు చేకూరాలన్నారు. వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ శిమ్మ నేతాజీ మాట్లాడుతూ జిల్లాలో సంపూర్ణ యాంత్రీకరణ ద్వారా తక్కువ ఖర్చుతో వరి సాగు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 50 ఎకరాలు ఒక క్లస్టర్‌గా తీసుకుని లక్ష ఎకరాల్లో సంపూర్ణ యాంత్రీకరణ కావాలన్నారు. వ్యవసాయశాఖ జెడి కె.శ్రీధర్‌ మాట్లాడుతూ జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకున్నా, ఈనెలలో కురుస్తున్న వర్షాలతో వ్యవసాయానికి అనుకూలంగా ఉందన్నారు. వచ్చే నెల 15వ తేదీ వరకు వర్షాభావం లేకుంటే అందుకు తగిన విధంగా పంటలు వేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నవంబర్‌ 15 వరకు సాగునీరు అందించగలిగితే, అనుకున్న స్థాయిలో దిగుబడి లభిస్తుందన్నారు. రాగోలు వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ప్రధాన శాస్త్రవేత్త పి.వి సత్యనారాయణ మాట్లాడుతూ నీటి సాంద్రతను బట్టి ఈ ఏడాది ఎంటియు 1224, 1121 రకాలు అనుకూలంగా ఉంటాయన్నారు. వంశధార పర్యవేక్షక ఇంజినీర్‌ డోల తిరుమలరావు మాట్లాడుతూ ఈనెల 8న వంశధార నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం ఆరు వేల క్యూసెక్కుల నీరు లభ్యమవుతోందని తెలిపారు. నారాయణపురం ఆనకట్ట ద్వారా 37 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, డిసిసిబి చైర్మన్‌ కె.రాజేశ్వరరావు, జిల్లా నీటిపారుదల సలహా మండలి సభ్యులు గొండు రఘురాం, నాబార్డు డిడిఎం వరప్రసాదరావు, ఎల్‌డిఎం ఎం.సూర్యకిరణ్‌, ఉద్యానశాఖ అధికారి ఆర్‌.వి ప్రసాదరావు, మత్స్య, పశుసంవర్థకశాఖ జెడిలు పి.వి శ్రీనివాసరావు, ఎం.కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.