ప్రజాశక్తి - పెద్దాపురం పోలీసు శాఖలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా నేరాల అదుపుకు కృషి జరుగుతోందని ఏలూరు రేంజ్ డిఐజి అశోక్ కుమార్ అన్నారు. బుధవారం పెద్దాపురం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఆయన ప్రత్యేక తనిఖీలు నిర్వహించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమైన కేసులకు సంబంధించిన పైళ్లను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ సిబ్బందికి ఎటువంటి నష్టాలు వాటిల్లకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విధి నిర్వహణలో పోలీసులకు ఎంతో సహకరిస్తో ందన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. గంజాయి విక్రయిస్తున్న వారి వివరాలను సేకరించడంతోపాటు వారికి గంజాయిని సరఫరా చేస్తున్న ఏజెన్సీలను గుర్తిస్తున్నామన్నారు. గంజాయి సాగును పూర్తిగా నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. నిరంతర ప్రక్రియగా తనిఖీలు నిర్వహించడం ద్వారా గంజాయిని పూర్తిగా నిరోధించవచ్చన్నారు. తాజాగా రాష్ట్రంలో వెలుగు చూస్తున్న సైబర్ నేరాలను అదుపు చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఇద్దరు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. బ్యాంకులు, ఎటిఎం ద్వారా డబ్బులు పోగొట్టుకున్న బాధితులు వెంటనే పోలీస్ స్టేషన్లో సైబర్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి సతీష్ కుమార్, డిఎస్‌పి లతా కుమారి, సిఐలు రవికుమార్,దుర్గాప్రసాద్, ఎస్‌ఐ వి.సురేష్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.










